Tuesday, December 24, 2024

అనుబంధ సుగంధాలు నడుమ కామేశ్వరి ఘుమఘుమలు ఆవిష్కరణ

హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : గోదావరీతీరం కవిత్వ సాహిత్యాల్లో మాత్రమే అగ్రస్థానంలో కాకుండా.. తెలుగు వంటల ఘుమఘుమల్లో కూడా అందెవేసిన చెయ్యి అని ప్రముఖ రచయిత్రి చంగలువల కామేశ్వరి తన విలక్షణ రచనతో నిరూపించారని పలువురు ప్రముఖ కవయిత్రులు, రచయిత్రులు కొనియాడారు.

బుక్ ఫెయిర్.లో సోమవారం సాయంత్రం సాదిక్ వేదికపై జరిగిన జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో చంగలువల కామేశ్వరి రచించిన గోదావరి ఘుమఘుమలు గ్రంథాన్ని ఆవిష్కరించారు. తొలిప్రతిని స్వీకరించిన ప్రముఖ కవి, బుక్ ఫెయిర్ కమిటీ అధ్యక్షులు యాకూబ్, కామేశ్వరి కృషిని ఈ సందర్భంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో అతిథులుగా ప్రఖ్యాత సాహితీవేత్త ఆలూరి విజయలక్ష్మి, శామీర్ జానకీదేవి, వాసా మీనాక్షి, అల్లూరి గౌరీలక్ష్మి, ఆకెళ్ళ వెంకటసుబ్బలక్ష్మి, అత్తలూరి విజయలక్ష్మి, నండూరి సుందరి నాగమణి పాల్గొని, ఈ గ్రంథం వర్తమాన తరాల యువతులకు ఎంతో ఉపయోగపడుతుందని అభినందించారు.

గ్రంథ రచయిత్రి చంగలువల కామేశ్వరి మాట్లాడుతూ బుక్ ఫెయిర్.లో ఆవిష్కరించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని, కమిటీ చైర్మన్ యాకూబ్.కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రేక్షకులు, రసజ్ఞులు, మేధావులు, వివిధ మహిళా సంస్థల ప్రతినిధులకు ప్రముఖ సినీ రచయిత తనికెళ్ళ భరణి శివతత్వాల అద్భుత కావ్యం ఆటకదరా శివా పుస్తకాన్ని, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనం శ్రీమాలిక మహా మంగళగ్రంథాన్ని, ప్రముఖ కవయిత్రి మంజులా సూర్య ప్రచురించిన శివోహం దివ్య గ్రంథాన్ని ఒక చక్కని పవిత్ర ప్యాకెట్ గా చేసి జ్ఞాపికలుగా బహూకరించడం అందరినీ ఆకట్టుకుంది.

కామేశ్వరి తన అనుచర సహచర బృందంతో తనికెళ్ళ భరణి, పురాణపండ శ్రీనివాస్, మంజుల సూర్య దివ్య గ్రంథాలను వేదికపై అతిథులకు అందించారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆత్మీయబంధంగా, అనుబంధాల సుగంధంగా నడిపించిన చంగలువల కామేశ్వరిని అందరూ అభినందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement