ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన కూచిపూడి నృత్యోత్సవం అలరించింది. జాతీయ సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, నాట్య గురువు దీపికారెడ్డి పర్యవేక్షణలో సంయు, ఖుషీ కూచిపూడి నాట్యంలో రంగప్రవేశం చేశారు. వేదికపై వారి నృత్య రీతులు అందరినీ ఆకట్టుకున్నాయి.
కాగా, సంయు కమటం , ఖుషీ కమటం తల్లి తండ్రులు సంజయ్, రోహిణిల ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక.. గురు దీపికారెడ్డి కొరియోగ్రఫీతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న లతా మా ఫౌండేషన్ ట్రస్టీ కొంపెల్ల మాధవీలత, నటుడు తనికెళ్ల భరణి, రచయిత పురాణపండ శ్రీనివాస్ కూడా సభికుల్ని ఆకర్షించారు.
ఇక.. సంయు , ఖుషీ కూచిపూడి నృత్యోత్సవంలో రాగమాలిక రాగంతో శ్రీ గణేశ పంచరత్నం, రాగమాలిక రాగంతోనే శివ శివ భవ భవ శరణం, ఆనందభైరవి రాగంతో మధురానగరిలో, ధేనుక రాగంతో కాళికాష్టకం, శంకరాభరణ రాగంతో అలరులు కురియగా, ధనశ్రీ రాగంలో తిల్లానలకు చేసిన నాట్య వైభవం ఆహూతుల్ని విశేషంగా ఆకర్షించింది.