Wednesday, January 15, 2025

పశు సంపద పండుగ… కనుమ

తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను, ఆప్యాయత అనురాగాలను … పల్లె సొగసులను అందంగా ఆవిష్కరించే పెద్ద పండుగలో, భోగి, సంక్రాంతి తరువాత రోజున ‘కనుమ’ పండుగ పలకరిస్తుంది. పల్లె జీవన విధానాన్ని.. పశువులతో.. పంటలతో అక్కడి వారికి గల అనుబంధాన్ని ఈ పండుగ అందంగా ఆవిష్కరిస్తుంది. మనిషి ప్రకృతిని సరిగా వినియోగించుకోలేక, దూరమవుతున్నా, రైతులు ఏనాడు పశు సంపదను తమ నుంచి వేరుగా చూడలేదు. వాటిని కుటుంబంలో భాగస్వాములుగానే భావిస్తారు. పైగా అనాదిగా పశువులను రాముడు, శివుడు… లక్ష్మీ అని లేడా ఇతర ముద్దు పేర్లతో ఆప్యాయంగా పిలవడం అలవాటుగా చేసుకున్నారు. ఎద్దు, ఆవు, లేగ, దూడ అనకుండా, వాటిని పెంపుడు జంతువులుగా కాకుండా, తమ కుటుంబ సభ్యులుగా, భావించారు. పుట్టిన రోజుల, బారసాలల లాంటి పిల్లలకు ఇళ్ళల్లో జరిపే వివిధ సంప్రదాయ కార్యక్రమాల వలె తమతో కలిసిపోయి, సహాయకులుగా ఉన్న పశువులకు ప్రత్యేకంగా ఒక రోజు పండగ ఉండాలన్న ఆలోచనతో పూర్వీకులు ఏర్పాటు చేసిన పండుగే కనుమ. పంటలు పండింపచేసే భగవంతుడికి, పొలాన్ని దున్నే ఎద్దులకి కృతజ్ఞతలు తెలిపే పండుగగా దీనిని జరుపు కుంటారు. కనుమ సమయానికి పంట చేతికి వచ్చి, పశువులకు, రైతులకు…వ్యవసాయానికి కొంత విశ్రాంతిని ఏర్పరుచుకునే సమయం. ఇంటిల్లిపాదీ ఆనందంగా ఉండే సందర్భం. ఇప్పుడు కాస్త విశ్రాంతి. పల్లెల్లో పశువులే గొప్ప సంపద, అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సా#హం. వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. అందుకే పశువులకు కృతజ్ఞతగా జరుపుకునే పండుగగా కనుమను జరుపుకుంటారు. కనుమ రోజు పశువులను కడిగి వాటిని అలంకరిస్తారు. కొమ్ములకు రంగులు వేస్తారు. సాయం చేసే జీవులకు మన కుటుంబంలోనూ, మనసులోనూ స్థానం కల్పించాలని, వాటి పట్ల ప్రేమ, అనురాగం కలిగి ఉండాలన్న సందేశం ఇచ్చే పండుగ కనుమ.
వ్యవసాయ దారుడికి పశువులే ధనం. వాటి శ్రమ మూలంగా ఆ సంవత్సరం పంట చేతికి వచ్చిన సందర్భంగా కృతజ్ఞతా సూచకంగా వాటికి కొత్త బియ్యంతో పొంగలి వండిపెట్టే ఆచారం ఏర్పడింది. పాడి పంటలు అనే జంట పదాల్లో పాడి శబ్దం పూర్వ పదం. ఒక విధంగా పంట కంటే కూడా పాడి ప్రయోజనమ్కెన దన్నమాట. కష్ట పడిన పండించిన ధాన్యం సమృద్ధిగా ఇంటికి చేరే సమయం, పశువులు విశ్రాంతిగా ఉండే సమయం కాబట్టి అందరూ ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపు కుంటారు. కనుమ రోజున ఆవులు, దూడలు, ఎద్దుల్ని శుభ్రంగా కడిగి కొమ్ములకు ముఖానికి పసుపు పూసి కుంకుమ పెడతారు. కొమ్ములకు అలంకరిస్తారు. వీటిని వీథుల వెంట తిప్పుతూ ఉంటారు.
కనుమ రోజు తప్పకుండా మినుములు తినాలి. మినుములు చాలా శక్తివంతమైన ఆహారం. అందుకే తెలుగునాట గారెలు, వడలు తినే సంప్రదాయం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ‘కనుమ’ నాడు ‘మినుములు’ తప్పక తినాలనే ఆచారం ఉంది. అందుకే ‘మినప గారెలు’ చేసుకొని తింటారు. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అత్తింటికి వెల్ళిన అల్లుళ్ళు కూడా కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు. కనుమ రోజు కాకి కూడ కదలదని సామెత.

  • రామకిష్టయ్య సంగనభట్ల
Advertisement

తాజా వార్తలు

Advertisement