Saturday, November 23, 2024

గో ఆధారిత ఉత్ప‌త్తుల‌తోనే క్యాన్స‌ర్ ర‌హిత స‌మాజం : టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి

తిరుపతి : కోరిక‌ల‌ను అదుపులో ఉంచుకుని ప్ర‌శాంత‌మైన మ‌న‌స్సుతో యోగా, ధ్యానం అల‌వ‌ర‌చుకుని గో ఆధారిత వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను ఆహారంగా తీసుకుంటే క్యాన్స‌ర్ ర‌హిత స‌మాజాన్ని నిర్మించ‌వ‌చ్చ‌ని టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి చెప్పారు. టీటీడీ మ‌హిళా ఉద్యోగుల‌కు క్యాన్స‌ర్‌పై శ్వేత ఆధ్వ‌ర్యంలో మూడు రోజుల అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం శుక్ర‌వారం తిరుప‌తిలోని మ‌హ‌తి ఆడిటోరియంలో ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ మ‌హిళ‌ల‌కు క్యాన్స‌ర్ ప‌ట్ల అవ‌గాహ‌న ముఖ్య‌మ‌ని చెప్పారు. క్యాన్స‌ర్‌ను తొలి ద‌శ‌లోనే గుర్తిస్తే పూర్తిగా నివారించ‌వ‌చ్చ‌ని తెలిపారు. ప‌సిపిల్ల‌ల‌కు పాలిచ్చే త‌ల్లుల‌కు రొమ్ము క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశం దాదాపు లేద‌న్నారు. మాంసాహార భోజ‌నం, పాశ్చాత్య ఆహార అల‌వాట్లు క్యాన్స‌ర్‌కు ఒక కార‌ణ‌మ‌ని చెప్పారు. గోవును ర‌క్షించి గో ఆధారిత వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను తింటే వంద శాతం క్యాన్స‌ర్ రాకుండా చూడ‌వ‌చ్చ‌న్నారు. అందువ‌ల్లే టీటీడీ గో ఆధారిత వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హిస్తూ మార్కెట్ ధ‌ర కంటే ఎక్కువ చెల్లించి రైతుల నుండి 12 ర‌కాల ఉత్ప‌త్తులు కొనుగోలు చేయాల‌ని టిటిడి బోర్డు నిర్ణ‌యించింద‌న్నారు. ఆరోగ్య విష‌యాల‌పై త‌ల్లి అవగాహ‌న కుటుంబం మొత్తానికి, త‌ద్వారా స‌మాజానికి మేలు చేస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. టీటీడీ ఉద్యోగులు మాంసాహారం మానుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఎస్వీబీసీ ప్ర‌సార‌మ‌వుతున్న యోగ‌ద‌ర్శ‌నం కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తి ఒక్క‌రూ చూడ‌డం వ‌ల్ల ఎంతో ఉప‌యోగం ఉంటుంద‌న్నారు. ప్ర‌ముఖ సినీ న‌టి గౌత‌మి మాట్లాడుతూ స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రికీ క్యాన్స‌ర్ ప‌ట్ల అవ‌గాహ‌న ముఖ్య‌మ‌ని చెప్పారు. వ‌య‌సుతో నిమిత్తం లేకుండా ఎవ‌రికైనా క్యాన్స‌ర్ రావ‌చ్చ‌ని, స‌రైన ఆహార అల‌వాట్లు, ర‌సాయ‌న ర‌హిత ఉత్ప‌త్తుల వినియోగం వ‌ల్ల దీనికి అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. క్యాన్స‌ర్ వ‌స్తే చావు ఖాయ‌మనే భ‌యం ఏమాత్రం అవ‌స‌రం లేద‌ని, ఇందుకు తానే నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. మ‌హిళ‌లు స‌మ‌స్య‌ల‌ను ఎదిరించి పోరాడితేనే స‌మాజంలో నిల‌బ‌డ‌గ‌లుగుతార‌ని అన్నారు. త‌న‌కు క్యాన్స‌ర్ వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ఇప్ప‌టిదాకా ఎదురైన అనుభ‌వాల గురించి వివ‌రించారు. ప‌లువురు ఉద్యోగులు అడిగిన ప్ర‌శ్న‌లకు ఆమె స‌మాధానాలిచ్చారు. జెఈవో స‌దా భార్గ‌వి మాట్లాడుతూ మ‌హిళా ఉద్యోగుల ఆరోగ్యంపై టీటీడీ యాజ‌మాన్యం ప్ర‌త్యేక దృష్టి సారించింద‌న్నారు. టీటీడీ చ‌రిత్ర‌లో తొలిసారి ఇంత పెద్ద కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్టు చెప్పారు. దేశంలో మ‌ర‌ణిస్తున్న ప్ర‌తి ఆరుగురిలో ఒక‌రు క్యాన్స‌ర్‌తో క‌న్నుమూస్తున్నార‌ని, అవ‌గాహ‌న‌, ముందుజాగ్ర‌త్త‌తో దీనికి అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ సిద్ధ‌, ఆయుర్వేద, యోగా ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించుకుని ఆచ‌రించాల‌ని కోరారు. ప్ర‌తి ఒక్క‌రూ ఉత్త‌మ జీవ‌న‌శైలిని అల‌వ‌రుచుకోవ‌డం ద్వారా వ్యాధుల నుంచి దూరంగా ఉండ‌వ‌చ్చ‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement