శోభకృత్ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టాము. ఈ అనంత కాల ప్రవాహంలో పరిమితంగా మన స్థానం కాల గణన ఏ విధంగా చేయాలి. మనం ఎక్కడ ఉన్నాము. అనేది తెలుసుకుందాం.
శ్రీమన్నారాయుణుని నాభి పద్మంలో పుట్టిన బ్రహ్మ ఆయుష్షు రెండు పరార్ధాలు. బ్రహ్మకు నూరు సంవత్సరాల ఆయుర్ధాయం. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు ఒక వెయ్యి సార్లు తిరిగితే బ్రహ్మకు ఒక పూట, అనగా నాలుగు వేల యుగాలు ఒక పూట. ఈ లెక్కలో బ్రహ్మకు నూరేళ్లు అంటే 3,11,4000 కోట్ల సంవత్సరాలు. మొదటి 50 సంవత్సారాలు పూర్వార్ధమని, తరువాతి 50 సంవత్సరాలు పరార్ధమని వ్యవహారం. సృష్టి నుంచి నేటి వరకు బ్రహ్మకు ఒక 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. 51వ సంవత్సరంలో మొదటి నెలలో, మొదటి పక్షంలో, మొదటి వారంలో, మొదటి దినంలో 17 ఘడియల 42 విఘడియల కాలం దానిలో ఒక గురువు అక్షరాన్ని ఉచ్ఛరించేంత ప్రాణ కాలం నడుస్తుంది. అంటే మూడు నిమేషముల (సెకన్ల). 19 లవముల 49వ తృటి ఇప్పుడు నడుస్తోంది. 49వ తృటిలో ఇంత వరకు 21,42,732 సౌర మానాది సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు శ్వేత వరాహ కల్పంలో స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, ఆది ఆరుగురు మనువులు గతించారు. అనగా ఆరు మన్వంతరాలు గడిచియి. ఇప్పుడు 7వది అయిన వైవస్వత మన్మంతరం నడుస్తోంది. ఈ మన్వంతరంలో 27 మహా యుగాలు గడిచాయి. 28వ మహా యుగంలో ఇది కలియుంగంగా వ్యవహరింపబడుతోంది. కలియుగం వచ్చి 5,120 సంవత్సరాలు గడిచింది. విక్రమార్క శకం మొదలై 2076, మధ్వాచార్యులు వచ్చి 903, శంకరాచార్యులు వచ్చి 2091, శాలివాహన శకం వచ్చి 1941, రామానుజ అవతారం వచ్చి 1002, భారత స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచాయి. ప్రస్తుతం 2023, 2024 పాశ్చాత్య సంవత్సరాలు జరుగుతున్నాయి.
యుగం అంటే 5 సంవత్సరాలు. ఈ సంవత్సరాత్మక కాలంలో 12 యుగాలు ఉంటాయి. అనగా 12ను 5తో హెచ్చ వేస్తే 60 సంవత్సరాలు ఇలా 12 యుగాలుగా కాలాన్ని పరిగణిస్తారు. యుగంలోని 5 వర్షాలను తైత్తిరీయ బ్రాహ్మణంలో సంవత్సరోసి, పరివత్సరోసి, ఇదావత్సరోసి, ఇదువత్సరోసి, ఇద్వత్సరోసి అని చెప్పారు. ఈ 5 వత్సరాలు ఒక యుగం. మళ్ళీ రెండో యుగం సంవత్సర, పరివత్సర ఆదిగా పరిగణించబడుతుంది. అనగా ప్రభవ సంవత్సరం, విభవ పరివత్సరం. శుక్ల ఇదావత్సరం, ప్రమోద ఇదువత్సరం, ప్రజాపతి ఇద్వత్సరము ఈ విధంగా 60 సంవత్సరాలలో ఈ 5 పన్నెండు సార్లు తిరుగుతాయి. ఇప్పుడు ఈ వికారి నామ సంవత్సరం 7వ యుగంలో ఉంది. ఈ యుగానికి దేవత ఇజ్యనామకం అనగా యజ్ఞం, 7వ యుగంలో 3వది అయిన ఇదా వత్సరం వికారినామ సంవత్సరం. ఈ ఇదా వత్సరానికి చంద్రుడు దేవత. వికారి అనగా కూడా అర్థం చంద్రుడే.
విశేషేణ క్రియతే ఇతి వికార:
విశేషేణ కార్యతే ఇతి వికార:
ఉన్నదానిలో ప్రతి క్షణము కలిగే పరిణామమును వికారము అంటాము. మొగ్గ-పువ్వు-పిందె-కాయ-పండు రాలిపోవుట ఇవన్నీ వికారాలే. శిశువు, బాలుడు,
కిశోరుడు, యువకుడు, జఠరుడు, స్థవిరుడు, వృద్ధుడు ఇవన్నీ శరీరంలో కలిగే వికారాలు. శరీరానికే కాక ప్రతి క్షణం మనసులో వేల కొద్ది వికారాలు సంభవిస్తాయి.
‘చంద్రమా మనసోజాతహ:’ అని వేద వాక్యం.
చంద్రుడు పరమాత్మ మనసు నుంచి పుట్టాడు. మనందరి మనసులకు అధి దేవత చంద్రుడే. ఆ చంద్రుడు కూడా శుక్ల పక్షంలో కళలు వృద్ధి చెంది కృష్ణ పక్షంలో క్షీణిస్తాయి. ఇది ఆయనలో కలిగే వికారం. వాతావరణం బాగుంటే అనగా ప్రకృతి, ఇంటి పరిసరాలు, మన పరిసరాలు అన్నీ బాగుంటే మనసు బాగుంటుంది. వాటిలో మార్పు వస్తే మనసులో మార్పు వస్తుంది. అందుకే వికారి అంటే మరో అర్థం మనసు.
ఈ సంవత్సరం వస్త్ర దానం చేయడం చాలా విశేషం. ‘చంద్రునికో నూలు పోగు’ అనే సామేత కూడా ఇందువల్లే పుట్టింది. చంద్రుడు రజతానికి అధి దేవత. అందుకే శక్తి ఉన్న వారు వెండిని, లేదా ముత్యమును దానం చేస్తారు. ఈ సంవత్సరం ప్రపంచ రాజ్యాలలో రాజ్యాధినేతలలో కూడా విశేషమైన మార్పులు సంభవిస్తాయి. కొన్ని ప్రమాదాలను, కొన్ని ప్రమోదాలను కలిగిస్తాయి. ఆవేశకావేశాలు, ఆందోళనలు ఈ సంవత్సరం ఎక్కువ జరిగే అవకాశం ఉంది. రాజుకు, మంత్రులకు పరస్పర వైషమ్యాలు కలుగుతాయి. ఈ సంవత్సరానికి రాజు శని అతను సూర్య పుత్రుడు, సంవత్సరం చంద్రడు, అధిపతి సూర్యాంశ. అందుకే రాజు వాడివేడిగా, మంత్రులు చల్లగా ఉంటారు.
ఈ వత్సర మానం 5 విధాలుగా ఉంటుంది. అవి చంద్రమానం, సౌర మానం, సావన మానం, నాక్షత్ర మానం, బార్హస్పత్య మానం.
చాంద్రమానం :
ఇది చంద్రుడి సంచారంతో లెక్కించబడుతుంది. అనగా శుక్ల ప్రతిపత్తు మొదలు అమావాస్య వరకు ఒక మాసం. ఈ మాసంలో పూర్ణిమ నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసానికి ఆ నామం ఉంటుంది. పూర్ణిమ నాడు చిత్త నక్షత్రం ఉంటే చైత్ర మాసం, విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖ మాసం అంటారు. ఈ చాంద్ర సంవత్సరంలో 354 రోజులు ఉంటాయి.
సౌరమానం :
మేషాది ద్వాదశ రాశులు సూర్య సంచారంచే కొలవబడు కాలం సౌరమానం. సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ పేరే ఆ మాసానికి వస్తుంది. సూర్యుడు మేష రాశిలో ఉంటే మేష మాసం, వృషభ రాశిలో ఉంటే వృషభ మాసం. ఈ సౌర సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి.
సావన మానం :
ఇందులో మాసానికి 30 రోజులు ఉంటాయి, ఇలా సంవత్సరానికి 360 రోజులు. ఇది యుగమన్వంతరాది విభాగానికి ఉపయోగిస్తుంది.
నాక్షత్ర మానం :
అశ్విని మొదలగు 27 నక్షత్రాల యందు చంద్రుని సంచారంతో ఏర్పడిన 12 మాసాలు కలది. ఈ సంవత్సరానికి 324 రోజులు ఉంటాయి.
బార్హస్పత్య మానం :
బృహస్పతి మేషాది రాశులలో సంచరించడం వలన ఏర్పడే ఈ సంవత్సరంలో 361 రోజులు ఉంటాయి.
అయనాలు :
సంవత్సరంలో రెండు అయనాలు ఉంటాయి. అవి ఉత్తరాయణం, దక్షిణాయనం. సూర్యుడు మకర సంక్రమణం మొదలు ఆరు రాశులు అనగా మిథున సంక్రమణం వరకు ఉండేది ఉత్తరాయణం. ఈ సమయంలో సూర్యుడు భూమధ్య రేఖకు ఉత్తరంగా సంచరిస్తాడు. సూర్యుడు కర్కాటక సంక్రమణం నుంచి ధనూ సంక్రమణం వరకు ఉండే కాలం దక్షిణాయనం. ఈ సమయంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. సామాన్యంగా ఉత్తరాయణం మాఘ మాసం నుంచి ఆషాఢ శుక్ల పక్షం వరకు, దక్షిణాయనం ఆషాఢ కృష్ణ పక్షం లేదా శ్రావణ మాసం మొదలు పుష్యమాసం వరకు ఉంటుంది.
ఋతువులు :
సంవత్సరానికి వసంత, గ్రీశ్మ, వర్ష, శరత్, హేమంత, శిశిరాలు అని ఆరు ఋతువులు ఉంటాయి. వీటిలో సౌర చాంద్ర ఋతువులు ఉంటాయి.
ఒక్కొక్క ఋతువులో రెండు మాసాలుంటాయి. చైత్ర వైశాఖాలు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢాలు గ్రీష్మ ఋతువు, శ్రావణ, భాద్రపదాలు వర్ష ఋతువు ఈ విధంగా రెండు మాసాలు ఒక ఋతువు.
మాసాలు :
చాంద్ర మాసం, సౌర మాసం, శ్రావణ మాసం, నాక్షత్ర మాసం అని మాసాలు నాలుగు. రాశి చక్రానికి సంబంధించిన కాలాన్ని రాశి, భాగ, లిప్త, విలిప్త రూపాలుగా పరిగణిస్తారు. 60 విలిప్తలు ఒక లిప్త, 60 లిప్తలు ఒక భాగం, 30 భాగాలు ఒక రాశి, 12 రాశులు ఒక భగణం. ఈ భగణంలో 12 రాశులు, 27 నక్షత్రాలు, తిథులు, వారం, యోగం, కరణాలను గుర్తిస్తారు. ఇలా సూర్యుడు ఒక సారి రాశి చక్రాన్ని చుట్టి వచ్చేందుకు 360 రోజులు 12 మాసాలు పడుతుంది. ఇది ఒక సంవత్సరం. ప్రతి మాసంలో శుక్ల పక్షం, కృష్ణ పక్షం అని రెండు పక్షాలుంటాయి. పక్షం అనగా 15 రోజులు. రోజుకు 60 ఘడియలు, ఘడియకు 24 నిమిషాలు, సూర్యోదయం మొదలు మరల సూర్యోదయం వరకు ఉన్న కాలాన్ని ఒక రోజు అంటారు.
పంచాంగం :
తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు వంటి ఐదు అంగములు కలదాన్ని పంచాంగం అంటారు.
తిథులు :
మొదటి పక్షంలో పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు, రెండో పక్షంలో పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉండేది 30 తిథులు.
వారాలు :
ఆది నుంచి శనివారం వరకు 7 రోజులు
నక్షత్రాలు :
అశ్వని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలు
యోగములు :
విష్కంభం నుంచి వైధృతి వరకు 27 యోగములు
కరణాలు :
భవ నుంచి కింస్తుఘ్నం వరకు 11 కరణాలు, ప్రతి రోజు రెండు కరణాలు ఉంటాయి.
సంవత్సరాలు :
ప్రభవ నుంచి అక్షయ వరకు 60 సంవత్సరాలు
గ్రహాలు :
సూర్య, చంద్ర, అంగారక, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులు 9 గ్రహాలు.
రాశులు :
మేషం నుంచి మీనం వరకు 12 రాశులు
యుగాల కాల ప్రమాణం
కలియుగం : 4,32,000 సంవత్సరాలు
ద్వాపర యుగం : 8,64,000 సంవత్సరాలు
త్రేత యుగం : 12,96,000 సంవత్సరాలు
కృత యుగం : 17,28,000 సంవత్సరాలు
ఈ నాలుగు యుగాల మొత్తం 43,20,000 సంవత్సరాలు, ఇది ఒక మహా యుగం. 71 మహా యుగాలు ఒక మన్వంతరం. 14 మన్వంతరాల కాలం బ్రహ్మకు ఒక పగలు. వెయ్యి మహా యుగాలు అనగా 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు ఒక పూట. పగలు రాత్రి కలిపితే 864 కోట్ల సంవత్సరాలు ఒక రోజు, ఇలాంటి రోజులు 30 ఒక నెల. ఆ నెలలు 12 ఒక సంవత్సరం. అటువంటి 100 సంవత్సరాలు బ్రహ్మ ఆయు: ప్రమాణం. ఇప్పుడు ఉన్నది ఏడవ బ్రహ్మ. ఇప్పటి వరకు ఆరుగురు బ్రహ్మలు గతించారు. ఆ బ్రహ్మల జన్మలకు పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న బ్రహ్మ శ్రీమన్నారాయణుడి నాభి నుంచి పుట్టినట్లు గానే వారు ఆ పరమాత్మ ఒక్కొక్క అంగం నుంచి పుట్టారు.
మానస జన్మ : శ్రీమన్నారాయణుని మనసు నుంచి పుట్టిన బ్రహ్మ
చాక్షుష జన్మ : ఆయన కంటి నుంచి జనించిన బ్రహ్మ
వాచిక జన్మ : వాక్కు నుంచి వచ్చిన బ్రహ్మ
శ్రావణ జన్మ : చెవి నుంచి ఆవిర్భవించిన బ్రహ్మ
నాసిక జన్మ : ఆయన ముక్కు నుంచి పుట్టిన బ్రహ్మ
అండ జన్మ : అండము నుంచి వచ్చిన బ్రహ్మ
పద్మ జన్మ : నాభి కమలం నుంచి పుట్టిన బ్రహ్మ