ముఖచిత్రాన్నిబట్టి పుస్తకంలోని విషయాన్ని ఎలా అంచనా వేయలేమో, అలాగే బాహ్య స్వరూపాన్ని బట్టి ప్రాణుల లేదా పదార్థాల లక్షణాలను అంచనా వేయలేము. మెరిసేదంతా బంగారం కాదు, తెల్లనివన్నీ పాలూకావు, నల్లనివన్నీ నీళ్ళూకావు మొదలైన మన నానుడుల ప్రబోధమూ ఇదే.
మన పురాణాలలో, ఆధ్యాత్మిక గ్రంథాలలో కాకుల ఘనత గొప్పగా వర్ణింపబడింది. కాకిని అశుభానికి సంకేతంగా భావించడం అనాదిగా వస్తూ ఉంది. కాకులు మనుషులపై వాలినా, తాకినా, ఇంటిలో దూరినా, ఇంటిలో ఉన్న ఆహారాన్ని ముట్టినా అరిష్టమనుకోవడం, కాకి అరిస్తే ఇంటికి చుట్టాలొస్తారని నమ్మడము, కాకికూటం (కాకుల మైథునం) చూస్తే మరణం తప్పదని భావించడం వంటి అపో#హలూ లోకంలో ఎక్కువగానే ఉన్నాయి. కానీ, కాకులనుండి మనం నేర్చుకోవలసిన అంశాలూ చాలా ఉన్నాయి.
బ్రా#హ్మ ము#హూర్తంలో నిద్రలేచి స్నానం చేయడం, సూర్యాస్తమయం తర్వాత ఆహారాన్ని స్వీకరించక పోవడం, ఆహారం లభించినప్పుడు స్వార్థ బుద్ధితో ఆలోచించకుండా, తన అరుపులతో తన వారినందరినీ పిలిచి, వాటితో కలిసి ఆహారాన్ని పంచుకొని తినడం, చీకటి పడేలోగా గూటికి చేరుకోవడం, తన శరీరాన్నీ, గూటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం, ధైర్యంగా, తెలివిగా ప్రవర్తించడం, జీవిత భాగస్వామిని ఎప్పుడూ మార్చకపోవడం, సంభోగ సమయంలో ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడటం, వంటి అనేక అంశాలను మనుషులు కాకులనుండి నేర్చుకోవలసి ఉంది.
లోకంలో, ప్రకృతిలో ఎన్ని మార్పులు వచ్చినా తన జీవన శైలినీ, సహజ లక్షణాలనూ మార్చుకోని ఒకే ఒక జీవి కాకి. కాకుల ప్రవర్తనను బట్టి ఫలితాలను చెప్పే ”కాక శాస్త్రం” కూడా ఉంది. అందుకే కాకిని ‘కాలజ్ఞాని’ అనికూడా అంటారు.
కర్ణ కఠోరమని లోకం చీదరించుకొనే ‘కాకి కూత’ ఎంతటి ప్రబోధాత్మకమో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి క్రింది పద్యం వర్ణిస్తుంది. ”స్థిరములు ‘కావు కావు’ చల జీవితముల్ — సిరి సంపదల్ సుఖం / కరములు ‘కావు కావు’ పలు గద్దెలు, మిద్దెలు నాత్మ శాంతికా/కరములు ‘కావు కావు’ నవకమ్ములు నిత్యము ‘కావు కావ’ టం/ చరచుచునుండె కాకి కనుమల్లదిగో బహరాము గోరిపై”. మనజీవితము, సిరి సంపదలు, అధికారము, భవనాలు, యవ్వనము-ఇవేవీ స్థిరములు, సుఖకరములు, శాంతి కారణములు ”కావు, కావు” అంటూ కాకులు మనకు తెలియ చెబుతూ ఉంటాయట.
కోకిల కేవలం వసంతకాలంలోనే కూస్తుంది. కానీ, ప్రజల కష్ట నష్టాలు, సుఖదు:ఖాలు, కరవులు కన్నీళ్ళు… వీటి అన్నిటిపై కాకిలాగా నిత్యం నినదించే కవిని కనుక నన్ను ”కవి కాకి”గా గుర్తించమని ప్రజాకవి శ్రీ కోగిర జై సీతారాం గారు పేర్కొనడం ‘కాకి’ పై ఆయనకు ఉన్న విశేష గౌరవాన్ని తెలియజేస్తున్నది. గుర్తించగలిగిన వారికి ప్రపంచంలోని ప్రతిదీ గురువే కదా !
——
- గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి