Home భక్తిప్రభ బుద్ధుడు.. అష్టజీవన సూత్రాలు

బుద్ధుడు.. అష్టజీవన సూత్రాలు

0
బుద్ధుడు.. అష్టజీవన సూత్రాలు

బౌద్ధులు నిర్వహించుకునే ప్రధాన ఉత్సవాల్లో ”బోధి దినోత్సవం” కూడా ఒకటి. డిసెంబర్‌ 8వ తేదీ న సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది గౌతమ బుద్దుడిగా మారిన రోజుగా బౌద్ధులు బోధి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. యువ రాజు సిద్ధార్థుడు ప్రజల నిజ జీవితాల్లో ఎదురవుతున్న కష్టాలు, దు:ఖాలు, పీడలు, అనారోగ్యాలు, బాధలు, కడు పేదరికం, మరణాలను చూసి చలించి జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి రాజ్య కాంక్షను వదిలి భారత్‌ లోని బుద్ధ గయా ప్రాంతంలో బోధి వృక్షం నీడన తపస్సు చేయడం, జ్ఞానోదయం పొందడం జరిగింది. మానవ జీవితంలోని బాధలకు సమాధానంగా ‘నిర్వాణ’ స్థితికి చేరటం, బుద్ధుడి ”అష్ట ఉత్తమ జీవన సూత్రాలు(నోబుల్‌ యైత్‌ ఫోల్డ్‌ పాథ్‌)”ను సూచించడంతో ప్రజలు బాధలకు దూరంగా మానసిక ప్రశాంతతతోఎదుగుతూ సంతోషమయ జీవితాలను గడపాలని బోధించారు. బోధి దినం ప్రారంభం 2,500 ఏండ్ల క్రితం ప్రారంభమైందని చరిత్ర పేర్కొంటున్నది. బోధి ఉత్సవం సందర్భంగా ఆత్మ విమర్శ చేసుకోవడం, ధ్యానం చేయడం, నూతన తీర్మానాలను చేసుకోవడం, బుద్ధుడి బోధనలను మననం చేసుకోవడం, వాటిని తు.చ. తప్పకుండా పాటించడానికి సంకల్పం తీసుకోవడం లాంటి సత్కార్యాలు చేపడతారు. వివేకం, కరుణ, భౌతిక సుఖాల పట్ల నిరాసక్తతలాంటివి మనిషి సుఖ జీవనానికి సోపానాలుగా ఉపకరిస్తాయని నమ్ముతారు. ఆధ్యాత్మిక ఆచారాలను పాటించిన మానవ జీవితాల్లో సానుకూల శక్తి ఉద్భవించి జ్ఞానోదయ స్థితికి చేరుతారని, మరో దు:ఖమయ జీవితం లేకుండా మోక్షం సిద్ధిస్తుందని బుద్ధుడు బోధించాడు. గౌతమ బుద్ధుడి బోధనల్లో ఎనిమిది జీవన మార్గాలు సూచించారు. సన్మార్గ దర్శనం/ఆలోచనలు(రైట్‌ వ్యూస్‌), సరైన తీర్మానాలు తీసుకోవడం(రైట్‌ రెజొల్యూషన్స్‌), సుభాషణ గుణం(రైట్‌ స్పీచ్‌), సత్కార్యాలను చేయడం(రైట్‌ యాక్షన్‌), సక్రమ మార్గంలో జీవనోపాధులు పొందడం(రైట్‌ లైవ్‌లీహుడ్‌), సరైన కృషి చేయడం (రైట్‌ ఎఫర్ట్‌), మానసిక ఆలోచనలు చక్కగా ఉండడం (రైట్‌ మైండ్‌ఫుల్‌నెస్‌), చక్కటి ఏకాగ్రతను పొందడం (రైట్‌ కాన్‌సెంట్రేషన్‌) అనే ఎనిమిది జీవన సూత్రాలను గౌతమ బుద్ధుడు బోధించాడు.అందరు ఆనందంగా, ఆరోగ్యంగా, పవిత్ర భావనలతో బాధలకు దూరంగా జీవించాలని బుద్ధుడు ఆకాంక్షించాడు. మనిషి కర్మకు కారణం మనస్సు మాత్రమే. మనం ఏ విధంగా ఆలోచిస్తే, ఆచరణలో పెడితే, అదే తప్పక జరుగుతుంది. ఆనందానికి మార్గం లేదు… ఆనందంగా ఉండడమే ఓ ఉత్తమ మార్గం అని గౌతముడు బోధించాడు. పంచడంతో ఆనందం తరిగి పోదని గుర్తుంచుకోవాలి. ఒక కొవ్వత్తి వేల కొవ్వత్తులను వెలిగించినట్లు ఒక మహోన్నతుడు వేల మందికి జీవనానంద ర#హస్యాలను బోధించగలడు.

  • డా||బుర్ర మధుసూదన్‌ రెడ్డి
Exit mobile version