Thursday, November 7, 2024

బ్రహ్మము- పరబ్రహ్మము

అన్నిటికంటే గొప్పది… దాని కంటే మరొక గొప్పది ఏదీ లేదో అదే బ్రహ్మము. సర్వ కారణము, సర్వా ధారము, సృష్టిలో వ్యాపించి వున్నది. పొందదగినది, సత్‌చిత్‌ ఆనంద లక్షణమైవున్నది. జీవులలో ‘నేను’ అనేదానికి అనుభవముగా ఉండగలది. సృష్టిలో సగుణము, సృష్టికి పూర్వము, నిర్గుణము, ఏ బ్రహ్మ సంకల్పమును అనుసరించి సృష్టి, స్థితి, లయములు జరుగుచున్నవో, తిరిగి ఆ బ్రహ్మలోనే సర్వము లయమవుతున్నాయో ఆ బ్రహ్మమే సాలోక్య, సామీప్య, సారూప్య ముక్తులకు ఆధారమై వున్నది.

పరబ్రహ్మము: బ్రహ్మయందు సంకల్పము నిర్వికల్పమైనప్పుడు ఆ నిర్వికల్ప బ్రహ్మమే పరబ్రహ్మ. సృష్టికి పూర్వమున్న బ్రహ్మ, అవ్యక్తము, సత్యం, జ్ఞానం అనంతం బ్రహ్మ. సృష్టి స్థితి లయములకు సంబంధం లేనిది. ఈ నిర్వికల్ప బ్రహ్మము నుండి సంకల్పము జనించనిది. శాశ్వతమైనది. ఆద్యంతములు లేనిది. మాయావరణ లేనిది. బ్రహ్మ లక్షణములకు అతీతమైన విలక్షణమై యున్నది. బ్రహ్మకు పరమైనది పరబ్రహ్మ. సాయుజ్యముక్తికి ధామమై నది. ఏ నిర్గుణ బ్రహ్మ సగుణమగుటకు ఆస్కారమో, అట్టి పరబ్రహ్మ మాత్రము సృష్టికి బీజ ప్రదాత. సాయుజ్య ముక్తి కి ధామము కాదు.

అచల పరిపూర్ణ పరబ్రహ్మ

శాశ్వత నిర్వికల్పము, త్రిగుణ రహితము, సగుణ నిర్గుణాతీతము, సృష్టి, స్థితి లయ పద్ధతికి ఎట్టి సంబం ధములేనిది. సృష్టికి బీజప్రదాత కానిది. శాశ్వతముగా కదలనిది. అచలము, ఉన్న దున్నట్లున్నది. దేశ కాలాదులకు మూల ము కానిది. దాని నుండి ఏదీ పుట్టదు. అది దేనినీ తన లోనికి లయము చేసుకొన దు. అన్నిటికీ నిరాధారమైనది. దాని నుండి సంకల్పము పుట్టదు. వ్యక్తా వ్యక్త ములు కానిది. సర్వకాలాలలో, సర్వ దేశా లలో అచలమై అద్వయమై, ముల్లు కూ డా గుచ్చడానికి ప్రదేశంలేక నిబిడీకృతమైయున్నది. ఎరుక లేనిది, చైతన్యము లేనిది, అహంకారము లేనిది, దీనిని బయలని, బట్ట బయలని, పరమ పదమని అచల పరిపూర్ణమని, అచల పరిపూర్ణ పరబ్రహ్మమని అంటారు.

పరిపూర్ణము: పరిపూర్ణము నిర్వికారము. దాని నుండి, దానికి సంంధము లేకనే, ఆనందము అనే స్పందన దానికదే కలుగు తుంది. ఈ ఆనంద స్పందనమే మూలవిద్య. ఈ ప్రథమ స్పందనకు మూల విద్య కారణము కాని పరిపూర్ణము కారణము కాదు. జీవ- ఈశ్వర- జగత్తులు మూడు మూల విద్య కారణాలు గనుక జీవేశ్వర జగత్తులు మాయా కల్పితములు. లోకాలు, లోకేశులు, లోకస్థులు కూడా మాయా కల్పితములే. అవన్నీ భ్రాంతే. పరిపూర్ణ భ్రాంతి రహితము. త్రిగుణరహితము, నిర్వికారము, శాశ్వతము, అలము, ఉన్నదున్నట్లున్నది. పరిపూర్ణమనగా అచల పరిపూర్ణము, అచల బ్రహ్మము. అచల పరిపూర్ణ పరబ్రహ్మము.

- Advertisement -

ఇహ రూపము: ఎదురుగా ఇంద్రియ గోచరముగానున్న దృశ్య జగత్తుకు అంతర్గతమైనది ఇహ రూపము. ఇది మధ్యలోనే వచ్చి, మార్పు చెందుతూ మధ్యలోనే పోయే స్వభావము కలది. ఆది అంతములు, ఉత్పత్తి నాశములు, చావుపుట్టుకలు కలది. ప్రాకృతము, పాంచభౌతికమైనది. మానసిక రూపమును సంతరించుకొన్నది. ఇహ అనగా ఇక్కడి సంగతి, ఇక్కడి సందర్భము కలిగినది. ఇంతగా వర్ణించిన ఇహ రూపము నిజానికి లేదు. లేకనే ఉన్నట్లు కల్పించబడినది. పైగా బాధించేది. ఇంద్రజాలము వంటిది. మిథ్య, మాయాకల్పితము, త్రిగుణాత్మకము, స్వప్నతుల్యము, స్వస్వ రూపమందు లేనిది. ఊహా మాత్రము. తనకు తానే తోచినది. పరజ్ఞానమందు తోచినది ఇహ రూపము.

పర రూపము: కనిపించే ఈ జగత్తుకు ఆవల వున్నది. ఇహ రూపానికి పరము, అతీతము గనుక పరరూపము అని పేరు. పర రూపుడు ఇహమునకు సాక్షిరూపుడు. ఇక్కడి వ్యవహారము అంతా భావనారూపమని తెలిసి, శరీర లక్షణాలకు, సర్వానికి ఆధారము, అవస్థా సాక్షిరూపము, మార్పు చేర్పులకు అతీతమైనది. ప్రేరణ రూపమైనది. ధారణా రూపమైనది. కాని అమృత రూపము, జీవేశ్వర జగత్తులో అఖండ సారమైనది. స్వత:సిద్ధమై వున్నది. శాశ్వతము, నిర్వికారము, నిర్వికల్పము అయినది పరరూపము.

– డి.పద్మలత

Advertisement

తాజా వార్తలు

Advertisement