తైత్తరీయ ఉపనిషత్తులో ”భృగువల్లి” అనే విభాగము ఉంటుంది. ఉపదేశాత్మకమైనది భృగువల్లి. భృగువు వరుణ మహర్షి కుమారుడు. ఒకనాడు ఉదయాన్నే అరుణోదయ కాంతులు ఆకాశాన్ని రాగరంజితం చేస్తుండగా.. మందమారుత స్పర్శతో పులకించిన స్వర్ణ నదీ తరంగాలు ప్రణవనాదాన్ని పలుకుతుండగా, పక్షుల కిలకిలారావాలు లయతాళధ్వనులు చేస్తుండగా.. ప్రశాంతమైన వాతావరణం.. మనసును రంజింప చేస్తుండగా భృగువు పూజాదికాలు నిర్వర్తించి.. ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తున్న సమయంలో అతని మనసుకొక సందేహం కలిగింది. ఆ సందేహం క్షణక్షణానికి పెద్దదవుతూ.. తనను నిలువనీయని స్థితిలో తండ్రిని చేరి.. తండ్రీ! ”బ్రహ్మము” అని దేనినంటారు.. దాని స్వరూప స్వభావాలను వివరించమని అడుగుతాడు.
భృగువులోని జిజ్ఞాసకు సంతోషించిన వరుణుడు వెంటనే సమాధానం ఇవ్వవచ్చు కాని.. దానితో జిజ్ఞాసువు మనసు వికసించదు.. అభ్యుదయాన్ని కోరుకునే వ్యక్తి దానికి తగిన పరిశ్రమను చేయాలి. పుస్తకస్తమైన జ్ఞానం అవసరమే కాని దానివల్ల ప్రయోజనం పరిమితమే. సమాజంలో జీవించాలన్నా.. జీవన ప్రయోజనాన్ని తెలుసుకోవాలన్నా.. ఇతరులపై ఆధారపడే వ్యక్తిగా.. సోమరిగా తయారు కాకుండా.. శోధించి సాధించాలి. అప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఎదిగి ఒదగాలంటే.. గురువు చూపిన మార్గంలో తన స్వయం ప్రతిపత్తితో ముందుకు సాగాలి. అందుకే.. కుమారుని బుద్ధికి పదును పెట్టాలని భావించిన వరుణుడు.. అందుకే స్పష్టంగా చెప్పకుండా.. ఆహారం, ప్రాణం, కన్ను, చెవి, మనసు, వాక్కు.. ఇవే భగవంతుడు.. అంతేకాదు.. ఈ సమస్త సృష్టీ దేని నుండి జనిస్తుందో.. దేనిని ఆశ్రయించి జీవిస్తుందో.. దేనిలో లయమౌతుందో దాని తత్త్వమే బ్రహ్మము… దానిని తపించి తెలుసుకోమన్నాడు. భృగువు తపించాడు. అన్నము వల్లనే ఈ సృష్టి సమస్తము జనించి, జీవించి దానిలోనే లయమౌతుందని తెలుసుకున్నాడు. అదే బ్రహ్మమని భావించాడు. ఆలోచనలో ఏదో అనుమానం… తిరిగి తండ్రివద్దకు వచ్చి ”బ్రహ్మము”ను ఉపదేశించుమని అడిగాడు. తండ్రి తిరిగి తపించమని చెప్పాడు.
భృగువు తపించాడు… ప్రాణం ఉంటేనే కదా సమస్త జీవులు జీవించేది.. అందుకే ప్రాణమే బ్రహ్మమని భావించాడు. ఆలోచించగా అది సంతృప్తినీయలేదు. ఎక్కడో ఏదో సందిగ్ధత… మళ్ళీ తండ్రిని అడిగాడు. తండ్రి తపించమని చెప్పాడు. భృగువు తపించి… మనస్సే బ్రహ్మమని తెలుసుకున్నాడు. ఆలోచనలో ఏదో అస్పష్టత… తండ్రిని అడిగాడు. తండ్రి తపించమన్నాడు… భృగువు తపించగా, అతనికి విజ్ఞానం బ్రహ్మమని స్పురించింది. పలు విధాలుగా తాను సాధించిన జ్ఞానాన్ని అనుభవంలో ప్రతిక్షేపించి చూచుకున్నాడు. అనుమానం కలిగింది… తిరిగి తండ్రిని చేరి బ్రహ్మమును ఉపదేశించమన్నాడు. తండ్రి కుమారుని అర్హతను వివిధగతులలో పరీక్షించాడు. భృగువుయొక్క జిజ్జాస, భక్తిశ్రద్ధలు, దీక్ష, పట్టుదల, ఆసక్తి, ఆలోచనలో పరిణతి… తనకు సంతృప్తినిచ్చిన పిమ్మట… తిరిగి తపించమని పంపాడు. భృగువు ఆలోచిస్తున్నాడు… అన్నం వల్ల ప్రయోజనమేమిటి? ప్రాణం వల్ల ఒరిగేదేమిటి? చంచలమైన మనసు ఏమి సాధించగలదు? విజ్ఞానం వికసితమైన బుద్ధి వల్ల పొందేదేమిటి? ఇలా తపించిన భృగువులో… వీటన్నింటి ప్రయోజనం.. ఆనందాన్ని పొందడమే కదా అనే స్పురణ కలిగింది. జీవుల యొక్క అంతిమ స్వరూపం ఆనందం! కాబట్టి ఆనందమే బ్రహ్మమనే ”ఎఱుక” కలిగింది. లోతుగా ఆలోచించిన కొద్దీ ఆనందం యొక్క వివిధ పార్శ్వాలు దృగ్గోచరమయ్యాయి. ఆనందమే ఆత్మస్వరూపమనే సత్యం అవగతమయింది.
తండ్రి తనను తపించమని చెప్పినప్పుడల్లా… భృగువు తన ఆలోచనాశక్తికి పదను పెట్టుకొని విసుగు విరామం లేకుండా లోతుగానే కాక విస్తృతంగా క్రొత్త క్రొత్తమార్గాలలో ఆలోచన చేయడం ఆరంభించాడు. ,పట్టుదలను పెంచుకున్నాడు. శ్రద్ధగా సంబంధిత విషయాలన్నింటినీ విశ్లేషించుకున్నాడు. ఏది అవసరమో, ఏది అనవసరమో, ఏది తక్షణమే ఆచరించాలో, దేనిని దూరంపెట్టాలో, దేనికోసం దేనిని వదిలివేయాలో తెలుసుకున్నాడు. ఆ ఆవేదనలో, తపనలో అతనిలో ”ఆనందో బ్రహ్మతి వ్యజనాత్” అన్న అనుభూతి కలిగింది. ఇక తండ్రిని ప్రశ్నించాల్సిన అవసరం కనిపించలేదు.
ఆనందమే బ్రహ్మము.. ఆ బ్ర#హ్మము మనలను కాపాడుగాక..
- పాలకుర్తి రామమూర్తి