Wednesday, November 20, 2024

త్రికరణ శుద్ధిగా సమర్పించడమే భక్తి!

”చిక్కడు వ్రతముల గ్రతువుల
జిక్కడు దానముల శౌచ శీలతపములన్‌
జిక్కడు యుక్తిని, భక్తిని
జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్దము నుండీ”

భగవద్భక్తి అంటే ఏమిటి?
జీవి తన స్వాతంత్య్ర భావాన్ని మరచి భగవంతునికి త్రికరణ శుద్ధిగా తనను తాను సమ ర్పించుకొని అతనికి ప్రీతికరమైన దానిని వ్రతరూపంలో అనుష్ఠించడం ”భక్తి”.
”భక్త్తి” అంటే పువ్వులతో పూజ చేసి ప్రసాదాలు పంచుకోవడం కాదు. భక్తి అంటే గొంతు పోయేలా చేసే భజనలు కాదు. క్యూలలో నెట్టుకుంటూ ఇతరులను తిట్టుకుంటూ చేసుకొనే దర్శనం కాదు. కడుపు మార్చుకుని చేసే ఉపవాసం కాదు. దేవుడికి మొక్కే మొక్కులు కాదు. భగవంతుని ఉనికిని అనుభవ సిద్ధం చేసుకొని, అతనిని ఎన్నడూ మరువక ఎల్లవేళలా అతని కి సాధన మాత్రుల మై, అతని ఆజ్ఞానుసారంగా నడుచుకోవడం. అట్టి భక్తి స్థిరపడాలంటే, భగవత్కథలను వినడం, భగవంతుని స్మరించడం, భగవన్నామాలను సంకీర్తించడం. భగ వంతునికి నిన్ను నువ్వు సమర్పించుకోవడం. ఏది జరిగినా నీ మంచికే అనుకొని నీ చుట్టూ ఉన్న సమాజం మంచి కోరడమే.
మోక్షమంటే శాశ్వత సుఖానుభవం, ఆ సుఖం నిరతిశయమైన ఆనంద రూపంలో కలు గుతోంది. ఆమోక్షం భగవదను గ్రహఫలం ఆ భగవదనుగ్రహం పొందడానికి ”భక్త్తి” ఒక్కటే పరమ సాధనం. భక్తి నిరపాయం కావాలంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధా భక్తులు కలగాలంటే భగ వంతుని యెడ ప్రీతి జనించాలి. అట్టి ప్రీతి జనించడానికి ఆయన గుణాలు రుచించాలి. అటు వంటి రుచి కలగడానికి భగవంతుని చరిత్రలు తెలియాలి. భగవంతుని చరిత్రలు ప్రతినిత్యం విన్నా, చదివినా భగవదనుగ్రహం కలుగుతుంది. అనుగ్రహ ఫలంగా భగవంతుడు భక్తుని అంత:కరణలోనికి అడుగిడతాడు.
భగవంతుని ప్రవేశంతో మనస్సులోని మలినాలు తొలగుతాయి. తత్ఫలితంగా చిత్తశు ద్ధి కలుగుతుంది. అలా చిత్తశుద్ధి కలిగిన జీవుడు దేహ సంబంధాలైన దార, పుత్రాది భోగాల ను నిరసించి సర్వక్లేశాలకూ అతీతుడై భగవత్పాదమూలాన్ని చేరుతాడు. అదే జీవునికి పర మ నివాస స్థానమని తెలిసికొని అందే నిలిచి వుంటాడు.
మనస్సు నిరంతరం ఆనందం కోసం ప్రాకులాడుతుంది. విషయాలు తాత్కాలికానం దాన్ని ఇచ్చినా తుదకు దు:ఖకారణాలవుతున్నాయి. విషయాలు అస్థిరాలు వీటివల్ల లభించే ఫలం కూడా అస్థిరమే అవుతోంది. విషయానంద స్వరూపం ఇది. బుద్ధి ఈ విషయాన్ని గ్రహిస్తే వైరాగ్యం కలుగుతుంది. దానితో శాశ్వతానందాన్ని యిచ్చే పదార్థాన్ని వెతకడం ప్రా రంభమవుతుంది. అలాగ వెతకివెతకి శాశ్వతానందాన్ని యిచ్చే పదార్థం ‘భగవంతుడని’ రూఢిగా తెలుసుకుంటుంది. ఆనందానుభూతి కాంక్ష ఎక్కువై దానిని పొందే ఉత్తమ మార్గా న్ని అన్వేషిస్తుంది. అలా అన్వేషించగా భక్తి ఒక్కటే, ఉత్తమ మార్గమని తెలుసుకుంటుంది. తద్వారా జీవుడు భగవద్భక్తిపరుడై భక్తికి ముఖ్యాంగమైన ధ్యానానికి ఉపక్రమిస్తాడు.
గుణత్రయ భేదాన్ని బట్టి భక్తి మొదట మూడు విధాలవుతున్నది. త్రివిధ భక్తి సంకల్ప భేదాలను బట్టి ఒక్కొక్కటీ మూడు విధాలుగా ఉన్నది. అందువల్ల భక్తి మొత్తం తొమ్మిది విధాలవుతోంది.
భక్తి తామస రూపమైనప్పుడు దానికి ”క్రోధం” మూలం. ఆ క్రోధం హింసాపూర్వకం, ధంభ పూర్వకం, మత్సరపూర్వకమని సంకల్ప భేదాలను బట్టి త్రివిధములు.
భక్తి రాజస రూపంలో ఉన్నప్పుడు ”అహంకారం” దీనికి మూలం. అది విషయ వాం ఛాపరం, యశ:కాంక్షాపరం, ఐశ్వర్యకాంక్షాపరం అని మూడు విధాలు.
భక్తి సాత్విక రూపమైనప్పుడు పాపక్షయార్థం, పరమేశ్వర ప్రీత్యర్థం, శాస్త్రవిధి కర్తవ్యతా భావపూర్వకం, అని మూడు విధాలు.
ఆ తొమ్మిది విధాలు శ్రవణ కీర్తన భేదాలను బట్టి తిరిగి ఒక్కొక్కటి తొమ్మిది విధాల వుతుంది. ఈవిధంగా ‘భక్తి’ ఎనభై ఒక్క విధాలుగా ఉంటుంది. మరల నిర్గుణ భక్తి, సగుణ భక్తి, నిర్గుణ భక్తిలో ఫలాపేక్షగాని, భేదదర్శనం గాని ఉండవు. నిర్గుణ భక్తులు ఏది కోరరు, సాయిజ్యం కూడా తిరస్కరిస్తారు. ‘భగవంతుని సేవాభాగ్యం’ ఒక్కటే పరమకాంక్షగా ఉంటుంది. సగుణ భక్తులు వారి వారి భక్తి విశేషాలను బట్టి సాలోక్య సమానైశ్వర్యం, సామీ ప్యం, సారూప్యం, సాయిజ్యం కోరి భగవంతుని భజిస్తారు. భగవంతుడు భక్తి యోగ్యమైన సాలోక్యాదులలో ఏదో ఒకటి అనుగ్రహిస్తాడు. అంతటితో సగుణ భక్తులు తృప్తి చెందుతారు.
త్రిగుణాలను దాటి బ్రహ్మ భావాన్ని పొందడానికి ‘నిర్గుణ భక్తి’ ఒక్కటే పరమోపా యం. కాల స్వరూపం అవ్యక్త గతిని ప్రసరించే తీరును, అవివ్యి కర్మల వలన జీవులు ఆత్మ దర్శనం చేసుకొనలేక, నానావిధ జనన మరణరూప సంవృతిని పొందుతున్నారు.
మనస్సును భగవంతుని పాదపద్మములపై నిలిపితే చిరభక్తి చేత జ్ఞానులౌతారు. భక్తి శరణాగత లక్షణం కలది. భక్తి వల్ల అహంకారం నశిస్తుంది.
సంసారం ఒక మహా సముద్రం. అది షడ్వర్గమనే పెనుమొసళ్ళ గుంపుతో నిండి ఉంది. ఈ మొసళ్ళను తప్పించుకొని సంసార సాగరాన్ని ఈదడం మహాకష్టం. భగవంతుని పాదమనే నావను ఆసరా చేసుకుంటే సంసార సముద్రాన్ని దాటవచ్చు. ‘భక్తి’ అనే కర్ణధారిని ఆశ్రయిస్తే దుస్తరమైన సంసార సాగరాన్ని దాటవచ్చు.
”అతిరహస్యమైన హరిజన్మ కథనంబు
మనుజుడెవ్వడేని మాపు రేపు
జాలభక్తి తోడ జదివిన సంసార
దు:ఖరాశి బాసి తొలగిపోవు”

Advertisement

తాజా వార్తలు

Advertisement