Tuesday, November 19, 2024

భక్తి-భక్తుడు

చేతనాచేతనములైన ఈలోకంలో కనిపించే అన్ని వస్తువులు పరమేశ్వరుని నుండి పుట్టి పరమేశ్వరునియందు అంతరించి ఉన్నాయి, లింగాకారుడైన పరమేశ్వరుడే అన్నింటికీ, అందరికి ఆధారభూతమైన వాడు, లింగాకారుడైన పరమేశ్వరుడు ఆకాశం వరకు వ్యాప్తి చెంది ఉన్నాడు, భూమి ఆయనకు కూర్చునే ఆసనం, సర్వ భూతములు ఆయనలో నెలవై ఉన్నాయి, సర్వ భూతములను, సమస్త ప్రపంచాన్ని తనలో లయమొన ర్చుకున్న పరమేశ్వరుడు లింగరూపంలో ఉన్నాడు, సదాశివుడు లింగము నందు ఆవిర్భవించి తన భక్తులను అనుగ్ర#హస్తున్నాడు. పరమేశ్వరుని ఆజ్ఞతో బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు లయము చేసిన వాటినే మరలా సృష్టి చేస్తున్నాడు. సర్వేశ్వరుని యొక్క ఇష్టము తప్ప ఇతరుల ఇష్టము ప్రకారం చేయడానికి అర్హత లేకుండుట ”అనన్యార్హత్వము”, సర్వేశ్వరుడే తప్ప వేరెవ్వరూ శరణ్యులు లేరని తెలిసికొనుట ”అనన్య శరణత్వము”, సర్వేశ్వరుని ఇష్టం ప్రకారం చేయడమే ఆనందకరము గాని ఇతరములు కావని ఉండడమే ”అనన్య భోగ్య త్వము”, సర్వేశ్వరుని సదా అనుభవిస్తూ ఆయన యొక్క ఇష్టము ప్రకారం చేస్తేనే మనుగడ ఉంటుందని తెలియడమే ”సంశ్లేషైకదారకత్వము” అట్లు చేయనిచో ప్రాణము నిలువదు అని యుండుట ”విశ్లేషాసహష్ణుత్వము”, భగవంతుడు నన్నేవిధంగా నడిపిస్తాడో ఆ రీతిగానే అంగీకరించి అచిత్తువలె ఆ దైవానికి వశమై ఉంటాననేది ”తదేక నిర్వాహ్యత్వము”, పై ఆరు గుణాలను త్రికరణ శుద్ధిగా ఆచరించాలి.
భక్తికి జాతి,కుల బేధాలు లేవు, చదువుతో సంబంధం లేదు, రూపంతో సంబంధం లేదు..అని నారద భక్తి సూత్రాలలో ”నాస్తితేషు జాతి విద్యా రూప కుల ధన క్రయాది భేద:” అని చెప్పారు, శ్రీకాళ#హస్తి క్షేత్రంలో సాలె పురుగు ఏ వేదం చదివింది, పాము ఏ శాస్త్రం పరిశీలించింది, ఏనుగు ఏ విద్యనభ్యసించింది, బోయవాడు తిన్నడు ఏ మంత్రం జపించాడు? వీళ్లంతా కాళహస్తీశ్వరుని పాదసేవ చేసి తరించిన వారేకదా, భక్తి చతుర్యుగాలలో విశిష్టమైనది, అందులోనూ కలియుగంలో మిక్కిలి ప్రశస్తమైనది, ఇది ప్రత్యక్ష ఫలమిచ్చేది. భగవానుని వశపరచుకోవడానికి భక్తి కంటే వేరు మార్గం లేదు. దుర్లభమైన మనుష్యు జన్మ పొందిన ఎవరైతే భక్తితో, స్థిరమైన మనస్సుతో దైవాన్ని ధ్యానం చేస్తాడో అతనికి ఆత్మ జ్ఞానం కలిగి తీవ్రమైన సంసార తాపం నుండి విముక్తి కలుగుతుంది
భగవంతుని సన్నిధికై మనం చేయు ప్రార్థన ప్రధానంగా రెండు రకాలు, అవి అనిష్ట నివృత్తి ప్రార్థన, రెండు ఇష్టప్రాప్తి ప్రార్థన. అనిష్ట నివృత్తి ప్రార్థన అంటే తనకు అనిష్టములైనవి విడిచి పోవునుగాక అనే ప్రార్థన, అనిష్టములనగా భగవత్‌ కైంకర్యానికి ప్రతిబంధకాలు, అవి మూడు రకాలు, 1.అజ్ఞానము వలన చేయు పాపములు. వీటినే అపరాధములు లేక అవిద్యా కర్మలు అంటారు. 2. పాపకార్యములమీదకు మనసు పూర్వ సంస్కారమును బట్టి ప్రసరించడం. వీటినే వాసనారుచులు అంటారు, 3. ఇట్టి అవిద్యా కర్మలకు, వాసనా రుచులకు హితువు ఈ దే#హ సంబంధము, పరిశుద్ధమైన ఆత్మకు దే#హము యొక్క సంబంధము పైన చెప్పిన పాపాలకు హితువైయున్నది, ఈమూడురకాల ప్రతిబంధకాలు నివృత్తి చేయమని ప్రార్థించుటయే అనిష్ట నివృత్తి ప్రార్థన. తరువాతది ఇష్టప్రాప్తి ప్రార్థన, ఈ ప్రార్థనకు ఉండవలసిన పరికరాలు రెండు, అవి ఒకటి భక్తి, రెండు జ్ఞానము, భక్తి జ్ఞాన సంపన్నులకు ఆధ్యాత్మికత అలవడి పరమాత్మ కృప‌ కటాక్షములను పొందుతారు.
భక్తునికి ఉండవలసిన లక్షణాలు మూడు. మొదటి లక్షణం అనపేక్ష. భక్తునికి ఎటువంటి ఆశలు అపేక్షలు ఉండకూడదు. శరీర ఇంద్రియ, మనోబుద్ధులతో కూడిన మానవుడు ఆశలు, అపేక్షలు లేకుండా ఉండాలి, అలాగే మనిషికి కోరికలు, వాంఛలు కలిగి ఉండడంలో తప్పులేదు, కాని ఆ అభీష్టములు, వాంఛలు భగవత్ప్రీత్యర్థంగా అనుభవించాలి. భక్తునికి ఉండవలసిన రెండవ లక్షణం శుచి. భక్తునికి ఉండవలసినది బాహ్యాంతర శుచి. బాహ్యమైన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచడమే కాదు. అంతర్‌ శుచి అత్యవసరం, భక్తులు శరీరాన్ని శుచిగా ఉంచడంతోపాటు, హృదయంలో భగవత్‌ ప్రేమను నింపుకోవాలి, మూడవది దీక్ష, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా, భగవంతుని వదలరాదని ప్రతిజ్ఞ పట్టాలి, ఈ విధమైన దీక్ష పూనినవాడే దక్షుడు. నిజమైన భక్తుడు.

  • శేఖరమంత్రి ప్రభాకర్‌
Advertisement

తాజా వార్తలు

Advertisement