Monday, November 25, 2024

ఉద్గీథోపాసన

”వేదానాం సామవేదోస్మి దేవానామ్‌ అస్మి వాసవ:
ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా!’
వేదాల్లో సామవేదాన్ని తానేనని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెబుతారు. తానే ఆ వేద రూపు డినని సాక్షాత్‌ భగవానుడు తెలియజేయడంవల్ల నాదోపాసన చేస్తే ఆ పరబ్రహ్మను పూజిం చినట్లేనన్న విషయం భగవద్గీత పదో అధ్యాయం. 22వ శ్లోకం తెలియచేస్తుంది.
నాదోపాసన అనేది మన సనాతన ధర్మంలో అంతర్భాగంగా అతి ప్రాచీనకాలం నుంచీ ఉన్నది. ఋగ్వేదకాలంలో ప్రసిద్ధిగాంచిన ‘ఓం’కారోపాసన నాదోపాసనయే. నాదమనేది పరబ్రహ్మం మొదటి వ్యక్తరూపంగా వేదం చెబుతుంది. భగవంతుని మొదటి పేరును, మన మెవరూ ఆయనకు పేర్లు పెట్టకముందు ఉన్న అసలైన పేరును ‘తస్య వాచక ప్రణవ:’ అంటూ ప్రణవ నాదంగా అభివర్ణించారు పతంజలి మ#హర్షి. ఈ ‘ఓం’కార ప్రణవనాదం సృష్టిలో నిరంతరం మారుమ్రోగుతూనే ఉన్నది. కానీ విషయ లంపటాలలో కూరుకుపోయిన మనం ఆ నిరంతర నాదాన్ని వినలేము. దైవాన్ని దర్శించలేము. కానీ సాధనతో దానిని విన వచ్చు. దర్శనాన్ని పొందవచ్చు. ఆ సాధన పేరే నాదోపాసన.
ప్రణవాన్ని ఎలా ఉచ్ఛరించాలో తెలిపే ఉపనిషత్‌ వాక్యమిది. ‘ఓం’కారాన్ని తైలధార లాగా విరామం లేకుండా ఉచ్ఛరించాలి. ఘంటానాదంలా మృదులంగా ప్రారంభించి, క్రమ క్రమంగా శబ్దాన్ని పెంచి, తిరిగి మృదుల స్థాయికి తీసుకురావాలని దీని అర్థం. ప్రణవం ఉచ్ఛారణ, ప్రణవోపాసన గురించి తెలుసుకోవాలంటే.. ముందుగా ప్రణవాన్ని అర్థం చేసు కోవాలి. ప్రణవం అంటే నిత్యనూతనం అని అర్థం. ‘ఓం’కారాన్నే ప్రణవం అంటారు. ‘ఓం’ కారంలో ‘అ’కారం, ‘ఉ’కారం, ‘మ’కారం, నాదబిందువులు ఉంటాయి. అవి వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఈశ్వర, సదాశివ తత్వాలను బోధిస్తాయి. ‘ఓం’కారంలో ఉండే ‘అ’కారం సృష్టికి, ‘ఉ’కారం స్థితికి, ‘మ’కారం లయకారకత్వానికి చిహ్నాలు. ఏ శబ్దం నుంచి అన్ని శబ్దాలూ వ్యక్తమవుతున్నాయో అదే ‘ఓం’కారం. సృష్టిలో మొట్టమొదట ఉద్భవించి నది ‘ఓం’కార ధ్వని. త్రివేదాలు (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం), త్రికాలాలు, త్రిధా మాలు ఇవన్నీ ప్రణవం నుంచే పుట్టాయి. ‘ఓం’కారం విస్తరించబడి గాయత్రీ మంత్రం అయింది’ అని ఉపనిషత్తులు చెబుతున్నాయి.
అది కేవలం ఓ మంత్రం కాదు; అన్ని మంత్రాలకూ అదే- బలం, జీవం, శక్తిరూపం. ”’ఓం’కారం లేని మంత్రం ప్రాకారం లేని గుడి వంటిది” అని పెద్దల మాట. అతిశయం, అహంకారం అతణ్ని వశం చేసుకున్నప్పుడు- పూర్తిగా సత్వగుణంలోకి మనసును నడిపించి సత్య ధర్మ శాంతి ప్రేమ లను అందజేసే ఔషధమే ‘ఓం’కారం!
సీతను రావణుడు అపహరించడంతో, శ్రీరామ చంద్రుడు దు:ఖితుడయ్యాడు. ఆమె జాడ కను గొనే ప్రయత్నంలో, సుగ్రీవుడితో మైత్రి సాగిం చాడు. అనంతరం సీతాన్వేషణకు ఆంజనే యుణ్ని దక్షిణ దిక్కు వైపు పంపించాడు. శత యోజనాల సముద్రాన్ని లంఘించ డానికి సిద్ధమయ్యాడు హనుమ. మహేంద్ర పర్వతం మీద నుంచి ఎగరడానికి ఆయన సన్నద్ధమైన తీరు ‘ఓం’కార తత్వాన్ని తెలియ జేస్తుంది. ఆకాశమార్గాన వెళ్లాలని నిశ్చయించుకొన్న మారుతి, వూపి రి దీర్ఘంగా పీల్చి వదులుతూ కొంత సేపు ప్రాణాయామ స్థితిలో ఉన్నా డు. ఒక్కసారిగా శక్తినంతా కూడ దీసుకొన్న ఆయన, ప్రణవ నాదం (‘ఓం’ శబ్దం)తో కుప్పించి ఆకాశవీధి లోకి ఎగిరాడని సుందరకాండ వెల్లడి స్తుంది.

”ఓమ్‌, ఓమిత్యేతదక్షర ముద్గీథ ముపాసీత
ఓమిత్యుద్గాయతి తస్యోప వ్యాఖ్యానమ్‌||”
అనే మంత్రంతో మొదలవుతోంది చాందోగ్యోప నిషత్తు. ‘ఓం’ అనే అక్షరాన్ని అంటే ‘ఓం’కారాన్ని ఉద్గీథము అంటారు. ‘ఓం’ కారాన్ని ‘ఓం’ అని దీర్ఘముగా గానం చేస్తూ ఉపాసించాలి. ‘ఓం’ కారము వివరణలో ఇలావుంది. ఈ సమస్త సృష్టి సారమూ పృథివి. ఈ భూమి రసమయంగా ఉంది. ఆ రసమే అంటే ఆ జలమే భూసారం. ఆ జల సారం ఓషధులు. ఓషధుల సారం పురుషుడు. ఆ పురుషుడి సారభూతంగా ఉన్నది వాక్కు. ఆ వాక్కుకు సారంగా ఋగ్వేద మంత్రాలు, ఋక్కుల సారంగా సామము లేదా సామవేద మంత్రాలు ఉన్నాయి. ఆ సామవేదానికి సారభూతంగా నెలకొని ఉంది ‘ఓం’ కారము. ఈ ‘ఓం’ కారమే సర్వానికి సారభూతంగా సర్వోత్కృష్టమై ఉంది. ఈవిధంగా అన్ని సారాలతో కూడి ఎనిమిదవదిగా ఉన్న ‘ఓం’ కారము పరమాత్మ యందుండుటకు సమర్ధమై ఉంది. ఋక్‌ అంటే వాక్కు. సామం అంటే ప్రాణం. ఉద్గీథం అంటే ‘ఓం’ కారం. ఋక్‌కి స్థానమైన వాక్కు, సామానికి స్థానమైన ప్రాణం, ఈ రెండింటి కలయికనే మిథునం అం టారు. ‘ఓం’కారంలో ఈ రెండూ అంటే ఋక్‌ సామాల మిథునం అనేది కలసి పోతుంది. అది ఎలా అంటే ప్రకృతి పురుషుల సంయోగంలా పరస్పరం ఇష్టపడినట్టు జరుగుతుంది.
లోకంలో దేనికైనా అనుజ్ఞ నిచ్చేప్పుడు ‘ఓం’ అంటూ అనుమతినిస్తారు. అందుకే దీనిని అనుజ్ఞాక్షరం అంటారు. ఈ అనుజ్ఞ వల్ల వృద్ధి అవుతుంది. కనుక దీన్ని సంవృద్ధి అంటారు.
ఈ ‘ఓం’ అనే అక్షరం వల్లే అన్ని కర్మలు ప్రవర్తిస్తున్నాయి. ‘ఓం’కార ర#హస్యాన్ని తెలుసు కొన్నవాడు, తెలుసుకొననివాడు ఇద్దరూ కర్మలు చేస్తారు. వీరుచేసే కర్మలను విద్యతో కూడిన కర్మలు, అవిద్యతో కూడిన కర్మలు అంటారు. విద్యతో అంటే జ్ఞానంతో చేసే కర్మలే వీర్య వంతమైనవి అంటారు.
ప్రజాపతి పుత్రులైన దేవతలు, అసురులు తమలో తాము వైరాన్ని పెంపొందించుకొని పరస్పరం యుద్ధానికి సన్నద్ధులైయ్యారు. అసురులను జయించాలనే లక్ష్యంతో దేవతలు ఉద్గీథోపాసన (‘ఓం’ కారానుష్ఠానము) మొదలుపెట్టారు. దేవతలు ముక్కులో ఉండే ప్రాణా న్ని అనుసరించి ‘ఓం’కారోపాసన చేయగా దానవులు పాపము చేత వేధించారు. దానితో ముక్కుద్వారా సుగంధ దుర్గంధాల మిశ్రమ కర్మల ఫలితం కల్గింది తప్ప అసురులను జయించే శక్తిని పొందలేకపోయారు. అదేవిధంగా మరల దేవతలందరూ వాక్కు, కళ్ళు, చెవులు, మనస్సుల ద్వారా ఉద్గీ థోపాసన చేయగా అసురులు వాటన్నిటినీ పాపాలతో త్రిప్పికొట్టారు. అదెలాగంటే, వాక్కు సత్యాన్ని, పాపమైన అసత్యాన్ని పలుకుతుంది. కళ్ళు అందమైన రూపాన్ని, పాపమైన కురూపాన్ని చూస్తుంది. చెవులు మంచి మాటల్ని, పాపాలు కల్గించే చెడ్డ మాటల్ని వింటుంది. మనస్సు పాపాన్ని పుణ్యాన్ని కూడా భావిస్తుంది. దాంతో దేవతలు అసురులను ఏమీ చేయలేకపోయారు. చివరగా దేవతలు ముఖ్య ప్రాణాన్ని ఆధారంగా చేసుకొని ఉద్గీథోపాసన చేయగా, అసురులు దేవతలను ఏమీ చేయలేక వారే నశించిపోయారు. ఈవిధంగా ముఖ్య ప్రాణం గురించిన జ్ఞానాన్ని సమృద్ధిగా పొందినవాడికి ఎలాంటి పాపం అంటదు. అటువంటి వాడికి అపకారం చేయ తలపెట్టినవాడు రాతిమీద కొట్టిన మట్టి ముద్దలా నాశనమవుతాడు.
ఈ కథలో ప్రణవోపాసన ఇంద్రియాల ద్వారా జరగలేదు. మన దే#హంలోని ముఖ్యశక్తి అయిన ప్రాణాన్ని ఆధారంగా చేసుకొనే ప్రణవోపాసన జరిగింది అనేది స్పష్టంగా చెప్ప బడింది. ప్రాణం గురించి తెలుసుకొన్నవాడు ఆత్మానుభవాన్ని పొందినవాడు కనుక అపాన వ్యానాది ఇతర ప్రాణాలను కూడా రక్షిస్తాడు.
పూర్వం ఈ ఉద్గీథోపాసనను ఆంగీరస మ#హర్షి చేసాడు. అది ప్రాణం, శరీరం ఈ రెండిం టి సారమై ఉండడంతో దాన్ని అంగీరసం అన్నారు. ‘ఓం’కారోపాసనను అర్ధం చేసుకొన్న దేవ గురువు బృ#హస్పతి ఆ ఉద్గీథోపాసన చేసాడు. ఈ ప్రాణాన్నే బృ#హస్పతి అంటారు.
ఆయాస్యుడనే ఋషి కూడా ఉద్గీథము చేయడం వల్ల ప్రాణానికి ఆయాస్యం అనే పేరు వచ్చింది. తరువాత దాల్భ్యుడి కుమారుడైన బకుడు అనే మ#హర్షి ఉద్గీథం గురించి తెలుసు కొని నైమిశారణ్యానికి వెళ్ళి అక్కడ ఋషులందరి కోరిక మేరకు ‘ఓం’కారాన్ని గానం చేశాడు. ఇదే ‘ఓం’కారం యొక్క అధ్యాత్మిక ఉపాసనా విధానం. అంటే ఆత్మను తెలుసుకొనే మార్గం. పరమాత్మ ఆధారంగా మానవుల శరీరంలో ఉండే ప్రాణమే ‘ఓం’కారం అని భావం. అధి దైవిక ఉపాసనా విధానంలో సూర్యోపాసనకు, తాపాన్ని కలిగించే సూర్యుణ్ణి ‘ఓం’కారంగా భావించి ఉపాసించాలి. మానవ శరీరంలో ఉన్న ప్రాణమే ‘ఓం’కారం.
లోకాన్ని చూసే సూర్యుడు కూడా ‘ఓం’కారమే. ప్రాణానికి స్వరం అని పేరు. ఆ సూర్యు డికి స్వరప్రత్యాస్వరమని పేరు. అందుకని ‘ఓం’కారాన్ని ప్రాణంగా, సూర్యుడుగా భావించి ఉపాసించాలి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే పేర్లతో శరీరంలో వివిధ కార్య క్రమాల్ని నిర్వర్తిస్తున్న ముఖ్య ప్రాణం ఈ ఐదింటిలోను మొదటిది. ప్రణవోచ్చారణ గృహస్థులకు, ప్రణవోపాసన యోగులకు శ్రేష్ఠం. ‘ఓం’కార సాధన అందరికీ ఆరోగ్యకరం,

  • భువనేశ్వరి మారేపల్లి, 9550241921
Advertisement

తాజా వార్తలు

Advertisement