అధ్యాయం 18, శ్లోకం 61
61.
ఈశ్వర: సర్వభూతానాం
హృద్దేశేర్జున తిష్ఠతి |
భ్రామయన్ సర్వభూతాని
యంత్రారూఢాని మాయయా ||
తాత్పర్యము : ఓ అర్జునా! పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై యుండి, భౌతిక శక్తి యంత్రముపై ఆసీనులైనట్లుగా నున్న సర్వజీవుల గతులను నిర్దేశించుచున్నాడు.
భాష్యము : అర్జునుడు తనకున్న కొద్దిపాటి జ్ఞానముతో ఒక జీవాత్మగా తనకేది మంచిదో ఏది మంచిది కాదో నిర్ణయించుట సరైనది కాదు. జీవాత్మ ఒక శరీరము నుండి మరొక శరీరమునకు మారు సమయములో అన్నింటినీ మరచిపోవును. కాని భగవంతుడు పరమాత్మ రూపములో ఉండి పూర్వ జపకయలలోని కోరికలను గుర్తు చేసి అతని నిర్ణయములకు సహాయము చేయును. పరమాత్మ ప్రతి జీవి యొక్క కర్మానుసారము తగిన శరీరమును నిర్ణయిం చుట పిమ్మట భౌతిక ప్రకృతి ఆ శరీరమును తయారు చేసి ఇచ్చును. జీవుడు అటువంటి కొత శరీరము లేదా కారులో ప్రయాణము కొనసాగించును. ఈ విధముగా జీవుడు పరమాత్మ పైన ఎంతో ఆధారపడి ఉంటాడు. కాబట్టి ఎవ్వరూ నేను స్వతంత్రుడనని భావించరాదు. జీవుడు ఎప్పుడూ భగవంతుని నియంత్రణలోనే ఉంటాడు. కాబట్టి భగవంతునికి శరణుపొందుటయే జీవుని ధర్మమని రాబోవు శ్లోకములో సూచించబడినది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..