అధ్యాయం 18, శ్లోకం 54
54.
బ్రహ్మభూత: ప్రసన్నాత్మా
న శోచతి న కాంక్షతి |
సమ: సర్వేషు భూతేషు
మద్భక్తి లభతే పరామ్ ||
తాత్పర్యము : ఈ విధముగా దివ్యస్థితి యందు ప్రతిష్టితుడైనవాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవమును పొంది ఆనందపూర్ణుడగును. దేని కొరకూ శోకించక, దేనినీ వాంచింపక అట్టివాడు సర్వజీవుల యెడ సమత్వ భావమును కలిగియుండును. అటువంటి స్థితి యందే అతడు నా శుద్ధ భక్తి యుత సేవను పొందుచున్నాడు.
భాష్యము : నిరకారవాదులకు బ్రహ్మ భూత స్థితిని చేరుకొనుటయే ఉత్తమ స్థితి. కానీ సాకారవాదులు దీనిని అధిగమించి శుద్ధ భక్తిలో స్థితులగుదురు. అనగా శుద్ధ భక్తిలో నియుక్తులైన వారు బ్రహ్మ భూత అను ముక్త స్థితిలో ఉన్నట్లే లెక్క. ఆ స్థితిలో జీవుడు బ్రహ్మముతో సమాన స్థితిలో నిలిచి ఉన్నా భగవంతుడు భక్తుని మధ్య ప్రభువు, దాసుల భావన కొనసాగుచునే ఉండును. శుద్ధ భక్తుడు భగవంతున్ని సేవించుట ద్వారా పూర్తి సంతృప్తిని, ప్రసన్నతను పొందుతాడు. భగవంతుడు సంపూర్ణుడు కాబట్టి భక్తుడు కూడా సంపూర్ణ సంతుష్టుడవుతాడు. ఇక అతనికి దు:ఖించవలసినది గాని, ఆశించివలసినది గానీ ఏమీ ఉండదు. ఈ ప్రపంచములోని ఉన్నత పదవులు గానీ, పేదరికము గానీ అశాశ్వతము గనుక అందరినీ సమా దృష్టితో చూచును. భగవంతుని సేవకు అవకాశము ఉండక పోవుట వలన భగవంతునిలో లీనమగుట అనేది భక్తునికి నరక ప్రాయమే అవుతుంది. ఇంద్రియములు సదా భగవంతుని సేవలో వినియోగించుట వలన అవి కోరలు తీసిన పాముల వలే హాని చేయవు. ఈ కలియుగమున శుద్ధ భక్తిని ప్రచారము చేసిన శ్రీ చైతన్య మహా ప్రభువుల కృప ద్వారా మాత్రమే ఇటువంటి ఉన్నతి స్థితి ప్రాప్తించగలదు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..