Saturday, September 28, 2024

భాగవత రచనకు స్ఫూర్తి

భాగవత ప్రవచనము ఎవరి కొరకు చేయబడినది? భాగవతమును అందరు వినలేరు అని శాస్త్రం చెపుతోంది. భాగవతమును శ్రవణం చేయడం అనేది కొన్నికోట్ల కోట్ల జన్మల తరువాత మాత్రమే జరుగుతుంది. వ్యాసుడు మిగిలిన అన్ని పురాణములను రచించినట్లు భాగవత పురాణమును రచించలేదు. అప్పటికి ఆయన పదిహడు పురాణములను రచన చేసేశారు. అన్నీ రచించేసిన తరువాత ఒకసారి సరస్వతీ నదీ తీరంలో తన ఆశ్రమమునకు దగ్గరలో కూర్చుని ఉన్నారు. మనస్సంతా ఏదో నైరాశ్యం ఆవహంచింది. ఏదో నిరాశ! ఏదో లోటు! తానేదో తక్కువ చేశాననే భావన! ”ఎక్కడో ఏదో చెయ్యడంలో ఏదో అసంపూర్తిగా మిగిలిపోయింది” అని అనుకున్నారు.
ఆయన తాను రచించిన ఇతిహాసాల గురించి ఆలోచించారు. ”వేదరాశినంతటినీ విభాగం చేశాను. పదిహడు పురాణములను రచించాను. బ్రహ్మసూత్రములను రచించాను. పరాశరుడికి సత్యవతీదేవికి నారాయణాంశలో కుమారుడిగా జన్మిం చినందుకు నేను చేయగలిగినంత సేవ చేశాను. ఈశ్వరుడి పాదములు పట్టి సేవిం చాను. ధ్యానం చేశాను. అయినా నా మనస్సుకు ఎందుకో లోటుగా ఉంది. ఎందుకు ఇంత లోటుగా ఉన్నది” అని ఆలోచన చేశారు.
వ్యాసులవారు అలా ఆలోచిస్తున్న సమయంలోనే మహానుభావుడు నారదుడు దర్శ నం ఇచ్చారు. మనకు రామాయణంలో మొదట సంక్షేప రామాయణం చెప్పినవాడూ నార దుడే. భాగవతంలో సంక్షేప భాగవతం చెప్పినవాడూ నారదుడే. ”నారం దదాతి ఇతి నార ద:”- ఆయన జ్ఞానమును ఇస్తూ ఉంటారు. అటువంటి నారదుడు వచ్చి వ్యాసునితో ఒక మాట చెప్పారు. ”వ్యాసా, నీ మనస్సు ఎందుకు అసంతృప్తితో, ఏదో లోటుతో ఉన్నదో తెలు సా? నువ్వు ఇన్ని విషయములు రచించావు. భారతమును రచించావు. కానీ భారతంలో కృష్ణ కథ ఎక్కడ చెప్పినా ధర్మం తప్పినటువంటి కౌరవులు ఎటువంటి పరిస్థితిని పొందుతు న్నారో, ధర్మమును పట్టుకున్నటువంటి పాండవులు ఎటువంటి పరిస్థితిని పొందుతున్నా రో అను ప్రధాన కథకు కృష్ణ కథను అనుసంధానం చేశావు. అంతే తప్ప కృష్ణ భక్తుల చరిత్రని, ఈ ప్రపంచమంతా ఎలా పరిఢవిల్లుతున్నదో విశ్వము ఎలా సృష్టించబడిందో పంచభూత ములు ఎలా వచ్చాయో, భగవంతుని నిర్హేతుక కృపచేత ఆయన సృష్టికర్తయై, స్థితికర్తయై, ప్రళయ కర్తయై ఈ లోకమును ఆయన ఎలా పరిపాలన చేస్తున్నాడో నీవు ఎక్కడా చెప్పలే దు. ఆ కారణం చేత నీ మనస్సులో ఎక్కడో చిన్నలోటు ఏర్పడింది. ఇది పూర్తి చేయడానికి నీవు భాగవత రచన చెయ్యి” అని ప్రబోధం చేశారు.
అప్పుడు వ్యాస భగవానుడు ఆనందమును పొందినవాడై ధ్యానమగ్నుడై ఆచమనం చేసి కూర్చుని భాగవతమును రచించడం ప్రారంభం చేశారు. ఇంత చేసిన తరువాత, ఏది చెయ్యడం మిగిలిపోయిందని వ్యాసుడు నైరాశ్యం చెందాడో, ఏది అందించడం చేత తన జన్మ సార్ధకత పొందుతుందని అనుకున్నాడో, ఏది అందించిన తరువాత ఏది తెలుసుకున్న తరువాత మనిషిలో ఒక గొప్ప మార్పు వస్తుందో, కొన్ని కోట్ల జన్మల నుండి మనస్సు ఏది పట్టుకొనక పోవడం వలన అలా జరిగిందో, ఏది పట్టుకోవడం వలన మనుష్య జన్మకు సార్ధ కత సిద్ధిస్తుందో అటువంటి మహౌషధమును వ్యాస మహానుభావుడు అందించడం ప్రారం భించారు. అందుకే అది వేరొకరు చెప్పడానికి కుదరదు. అది సాక్షాత్తు ఉపనిషత్తుల సారాం శం. జ్ఞానం అంతా కూడా భాగవతమునందు నిక్షేపింపబడినది. దీనిని చెప్పడానికి శుక బ్రహ్మ మాత్రమే తగినవ్యక్తి. అందుకని తన కుమారుడయిన శుకబ్రహ్మకి భాగవతమును ప్రబోధం చేశారు.
ఆ భాగవతమును శుకబ్రహ్మ పరీక్షన్మహారాజుగారికి ఏడురోజులు చెప్పారు. ఎటువంటి పరిస్థితులలో చెప్పారు? భాగవతం చెప్పబడిన పరిస్థితిని మీరు విచారణ చేయాలి. చెప్పినది ఏడురోజులే! అంతకన్నా ఎక్కువ రోజులు చెప్పలేదు. ఎందుకు ఏడురో జులు చెప్పవలసి వచ్చింది? భాగవతమును సప్తాహముగా చెప్పుకోవడం వెనుక ఒక రహ స్యం ఉంది. ఒక మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి. డెబ్బది సంవత్సరములు కాని, తొంబది సంవత్సరములు కాని లేక- ”శతమానం భవతి శతాయు: పురుష శ్శతేంద్రి య: ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతి” నూరు సంవత్సరములు కాని పూర్ణంగా బ్రతక నివ్వండి- కాని ఎన్నిరోజులు బ్రతికాడు అని పరిశీలిస్తే ఏడురోజులే బ్రతికినట్లు అని మనం తెలుసుకోవాలి. ఎందుచేత? ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతడు బ్రతికినది ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఇంతకన్నా ఇక రోజులు లేవు. ఎనిమిదవ రోజు యిక లేదు. ఎప్పుడు మరణిస్తాడు? ఈ ఏడు రోజులలోనే మరణిస్తాడు. ఎంత గొప్పవాడయినా వాడు పోవడానికి ఎనిమిదవ రోజు ఉండదు. ఎవ్వరయినా ఆ ఏడురోజులలోనే వెళ్లిపోవా లి. ఆ ఏడు రోజులలోనే పుట్టాలి. ఆ ఏడురోజులలోనే ఉండాలి. ఆ ఏడు రోజుల లోనే తిరగాలి. కాబట్టి భాగవత సప్తాహము అంటే నీవు ఏ రోజున భగవంతుణ్ణి స్మరిం చడం మానివేశావో ఆ రోజు పరమ అమంగళకరమయిన రోజు. ఆ రోజు భగవం తుని యెడల విస్మృతి కలిగింది కాబట్టి తన భగవన్నామమును పలకలేదు. ఈశ్వ రుడికి నమస్కరించలేదు. ఈశ్వరుని గురించిన తలంపులేదు. ఆ రోజున తను ఉన్నా మర ణించిన వానితో సమానం. కాబట్టి ఆ రోజున ఇంట్లో ఏమి తిరిగింది? నడయాడిన ప్రేతము ఒకటి తిరిగింది. ఒక శవం ఆ ఇంట్లో నడిచింది. కాబట్టి ఆరోజు ఆ ఇల్లు అమంగళం అయిం ది. కాబట్టి ఏది బ్రతుకు? నిజమయిన బ్రతుకు ఏది? నిజమ యిన బ్రతుకు ఈశ్వరుని నామ స్మరణమే! భగవంతుని నామమును ఎవరు స్మరిస్తాడో వాడు మాత్రమే బ్రతికివున్నవాడు. అయితే భగవంతుని నామము స్మరిద్దామంటే ఆ నామము అంత తేలికగా స్మరణకు వస్తుం దా! ఆ వస్తువునందు నీకు ప్రీతి ఏర్పడితే నీ మన స్సు భగవన్నామమును స్మరించడానికి అవ రోధం ఉండదు. మీరు ఎక్కడ కూర్చుని వున్నా మీ మనస్సు మీకు ఇష్టమయిన వస్తువును గూర్చి స్మరిస్తూ ఉంటుంది. మనస్సు ఆ వస్తువు నందు ప్రీతిచెందింది కాబట్టి ఎప్పుడూ ఆ వస్తువును స్మరిస్తూ ఉంటుంది. మీ మనస్సు ఈశ్వరునియందు ప్రీతి చెందకపోతే ఈశ్వరుని నామమును స్మరించదు. మనస్సు భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసిన బల మును వ్యాసభగవానుడు భాగవతము నందు ప్రతిపాదించారు. అందుకే భాగవతమును ఎవరు వింటారో వారి మనస్సు తెలిసో తెలియకో ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది. తదా త్మ్యం చెందుతుంది. అందుకే ఏకాగ్ర చిత్తంతో భాగవతం విన్నా, పారాయణం చేసినా సమస్త జయాలు కలుగుతాయని, సర్వకాల సర్వావస్థలయందు ఆ భగవంతుడు అండగా నిలబడ తాడని వ్యాసభగవానుడు మనకు భాగవతాన్ని అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement