Sunday, November 24, 2024

భగవంతుడికే పరిక్షా!

అన్నీ తెలిసినవాడు దేవుడు. అన్నీ తెలుసును అను కునేవాడు జీవుడు. అహం బ్రహ్మాస్మి దేవుడు. అహం బ్రహ్మాస్మి అనుకునేవాడు జీవుడు. భవబంధాలు లేని వాడు దేవుడు. బంధాలలోను బంధనాలలోను యిరుక్కునే వాడు జీవు డు. అంతా అన్నింటా తానై ఉండేవాడు దేవుడు. అన్నీ తానే అనుకునేవాడు జీవుడు. జ్ఞాన బ్రహ్మం దేవుడు. అజ్ఞాన తిమిరం జీవుడు. మోహంపబడేవాడు దేవుడు. మోహంతో ఉండేవాడు జీవుడు. విశ్వ పరిరక్షకుడు దేవుడు. విషయ లోలత్వ నిస్సారం జీవుడు. ఉర్విని ఉర్రూతలూగించే వాడు దేవుడు. భ్రమ లు, భ్రాంతుల ఊహలలో ఊగిపోయేవాడు జీవుడు.
అనంత కరుణాంత రంగుడు దేవుడు. అరిషడ్వర్గాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడు జీవుడు. దీనభక్త పరాయణుడు దేవుడు. దీనత్వంతో దేబిరించేవాడు జీవుడు. మనసు దోచేవాడు దేవుడు. మనసు చేసే మాయలో కొట్టుకునేవాడు జీవుడు. ఉర్వి జనులను ఉద్ధరించేవాడు దేవుడు. ఆశా నిరాశల నడుమ ఊగిస లాడే వాడు జీవుడు. రూప రహతుడు దేవుడు. రూప మోహతుడు జీవుడు. ఊగించేవాడు దేవుడు. ఊగిస లాడేవాడు జీవుడు. కళ్యాణమూర్తి దేవుడు. కల్లోలమూర్తి జీవుడు. సర్వం తనలో దాచుకున్నవాడు దేవుడు. సర్వా న్ని దోచుకునేవాడు జీవుడు. అహంకార రహతుడు దేవు డు. అహంభావ సహతుడు జీవుడు. విశ్వభరిత శోభి తుడు దేవుడు. విషయలోల బాధితుడు జీవుడు.
సర్వభోగ పూజితుడు దేవుడు. సర్వరోగ పీడితుడు జీవుడు. పాప నాశకుడు దేవుడు. పాప పోషకుడు జీవుడు. వేదనా రహతుడు దేవుడు. వేదనా భరితుడు జీవుడు. తరింపజేసే వాడు దేవుడు. తపన పడేవాడు జీవుడు. సర్వ వ్యాపకత్వం దేవుడిది. సర్వవ్యాపక తత్త్వం జీవుడిది. సందేశం దేవుడిది. సందేహం జీవుడిది.
ఇలా… దేవుడు జీవుడి మధ్య ఉండే బంధం విడ రానిది. విడదీయలేనిది. అద్వితీయమైనది. అద్వైతమై నది. అపూర్వమైనది. అమూల్యమైనది.
ఓ పట్టాన అర్ధం కానిది. అవ్యక్తమైనది. అనుభవైక వేద్యమైనది. అబేధ్యమైనది. భక్త పరాధీనమైనది. అన్నిటి కంటే భగవంతునిపై భక్తి ప్రధానమైనది.
సద్గురు సాయినాధుడు సశరీరుడై షిరిడీలో నివశించిన రోజులవి. అనేకమంది భక్తులు సాయినాధుని సేవలో తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. సాయి పట్ల భక్తిభావంతో నిరం తరం సేవ చేసుకుంటూ వుండేవారు. ముఖ్యంగా కొందరు సాయి బాబాకు సహాయకులుగా వుండేవారు. వారిలో కొందరు వ్యక్తిగత సహాయకులుగా బాబాకు దగ్గరగా వుండవారు. అలాంటి వారిలో శ్యామా అనే భక్తుడు షిరిడీ సాయినాధునికి వ్యక్తిగత సహాయ కుడిగా ఉండేవాడు. షిరిడీ సాయినాధుడ్ని సాక్షాత్తూ భగవత్‌ స్వరూపంగా భావించేవాడు శ్యామా. శ్యామాకి సర్వం సాయి నాధుడే. సాయినాధుడు ప్రతి వారినీ ఎల్లప్పుడూ రెండు అడిగే వారు. ఒకటి శ్రద్ధ (విశ్వాసం), రెండు సబూరీ (ఓర్పు). భక్తులు కూడా ఆ రెండింటి ప్రతీకగా సాయినాధునకు రెండు రూపాయ లు ఇచ్చేవారు. ఓ రోజు పోస్టుమేన్‌ సాయినాధుడికి మనీ ఆర్డర్‌ రెం డు రూపాయిలొచ్చిందని సాయినాధుని కోసం వచ్చాడు. ఆ సమ యాన సాయినాధుడు అక్కడ లేరు. శ్యామా తెలిసినవాడు కాబట్టి, మళ్ళీ రావాల్సిన అవసరం లేకుండా, సాయినాధుడు రాగానే యిచ్చేయమని చెప్పి, రెండు రూపాయలు శ్యామా కిచ్చే సాడు పోస్టుమేన్‌.
పోస్టుమేన్‌ వెళ్ళిన తర్వాత శ్యామాకు ఓ ఆలోచన వచ్చింది. ”మనీ ఆర్డర్‌ సంగతి నాకు నేనుగా బాబాకు చెప్పను. అతను భగవంతుడు కదా! డబ్బులు వచ్చిన సంగతి ఆయనకే తెలు స్తుంది. అడగలేదనుకో బాబా భగవంతుడు కాదని తెలిసి పోతుందని అనుకుని చేతిలో ఉన్న రెండు రూపాయి నాణాలను ప్రక్కనే ఉన్న స్థలంలో పాతిపెట్టాడు. సాయినాధుడు వచ్చారు. ఈమాట ఆమాట మాట్లాడారు కానీ మనీ ఆర్డర్‌ సంగతి అడగ లేదు. శ్యామా చెప్పలేదు. వారం గడిచింది. బాబా అడగలేదు. శ్యామా చెప్పలేదు. రోజులు గడుస్తున్నాయి. బాబా రెండు రూపా యల మాటే ఎత్తడం లేదు. శ్యామాకు అనుమానం ఎక్కువవు తోంది. ఏంచేయాలో పాలుపోవడం లేదు. ఆందోళన పడుతు న్నాడు. ఓవైపు విశ్వాసం. మరోపక్క పెరుగుతున్న అనుమానం. మధన పడిపోతున్నాడు. ఆరు నెలలు గడిచాయి. బాబా రెండు రూపాయల ప్రస్తావన తీసుకు రాలేదు. ఈయన భగవంతుడేనా? అనే అనుమానం బలపడుతోంది. మనసుని పదేపదే పీడిస్తోంది.
ఓరోజు రాత్రి శ్యామా యింటిలో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్నదంతా దోచుకుని వెళ్ళిపోయారు. శ్యామా, అతని పెళ్ళాం పిల్లలూ కట్టుబట్టలతో మిగిలిపోయారు. శ్యామా దు:ఖానికి అంతే లేదు. శ్యామా బాబా దగ్గరకు పరుగు పరుగున వెళ్ళాడు. భోరున ఏడుస్తూ జరిగినదంతా చెప్పుకున్నాడు. మీరే ఏదో ఒకటి చేయాలి. మీరేదిక్కు బాబా. మీరే దిక్కంటూ బాబా కాళ్ళ మీద పడ్డాడు శ్యామా.
అప్పుడు బాబా యిలా అన్నారు. ”చూడు శ్యామా! మీ యింటిలో దొంగలు పడి సర్వం దోచుకుపోతే నీ బాధంతా చెప్పు కోడానికీ, ఏడ్చుకోడానికీ నేను నీకున్నాను. ఆరునెలల క్రితం నా రెండు రూపాయలు ఒకడు దొంగిలించాడు. నేనెవరితో చెప్పు కోవాలి? నా బాధను చెప్పుకోడానికి నాకెవరున్నారు?” సూటిగా విషయం సమయం చూసి బైట పెట్టారు బాబా. శ్యామా బుర్ర గిర్రున తిరిగింది. బాబా సర్వాంతర్యామి తత్త్వం అర్ధమైంది. బాబా భగవత్‌ తత్త్వం శ్యామాకు అవగతమయ్యింది. బాబాను పరీక్షించాలనుకున్న తన అజ్ఞానానికి కుంచించుకుపోయాడు.
”క్షమించండి బాబా!” అంటూ కన్నీరు పర్యంతం అయ్యా డు శ్యామా. పశ్చాత్తాప పడ్డాడు.
మనం చేసే పరీక్షలకు భగవంతుడు లొంగడు. భగవంతుణ్ణి పరీక్ష చేసే పరికరాలు మన దగ్గర లేవు. మన కొలతలకు కొలమా నాలకు భగవంతుడు అతీతంగా ఉంటాడు. పరిశోధనలకు ప్రయోగాలకు అందనంత ఎత్తులో ఉంటాడు. దొరకనంత దూరంగా ఉంటాడు. అతడ్ని పట్టుకోగలిగేది, పట్టి ఉంచేది, బంధించేది, బంధన చేసేది భక్తి ఒక్కటే. భక్తిని పెంచుకుందాం. భగవంతుణ్ణి బంధించుకుందాం. జీవన బంధనాల నుండి విముక్తులవుదాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement