Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 45
45
త్రైగుణ్యవిషయా వేదా
నిస్త్రైగుణ్యో భవార్జున |
నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో
నిర్యోగక్షేమ ఆత్మవాన్‌ ||

తాత్పర్యము : వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జునా ! నీవు ఈ త్రిగుణములకు అతీతుడవై, ద్వంద్వముల నుండియు మరియు యోగక్షేమములనెడి చింతల నుండియు విడివడినవాడవై ఆత్మయందు స్థిరుడవగగుము.

భాష్యము : త్రిగుణాలలో ఉన్నంతకాలము భౌతిక కార్యాలలో చర్య ప్రతిచర్యలు జరుగుచూ ఉంటాయి. ఫలితాలను ఆశించి చేసే పనుల వలన, ఫలములకు ఆకర్షితమై ఈ జగమున బంధనమునకు కారణమగుచున్నది. భగవంతుడు అట్ట బద్ధ జీవులను క్రమేణ ఇంద్రియ భోగవాంఛల నుంచి విముక్తులును చేసి ఆధ్యాత్మిక స్థితికి చేర్చే ప్రయత్నముతో వేదాలలో కర్మకాండలను పొందుపరచెను. అందువలన ఇక్కడ అర్జునునికి ఆధ్యాత్మిక స్థితికి రమ్మని ఉపదేశించుచున్నాడు. ఉపనిషత్తుల యందు తెలుపబడిన ‘అథాతో బ్రహ్మజిజ్ఞాస’తో ఆధ్యాత్మికత్వాన్ని గురించి ప్రశ్నించినపుడు త్రిగుణాలకు అతీతమైన స్థితికి చేరే అవకాశమున్నది. ఈ లోపు మనము చేసే కార్యాలవలన వచ్చే ప్రతిచర్యలను ఓర్చుకుని కృష్ణుని కృపపై ఆధారపడుతూ, దానిని చూడటం నేర్చుకున్నవారు ద్వంద్వాలకు అతీతులు కాగలరు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement