Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 19
19
య ఏనం వేత్తి హంతారం
యశ్చైవం మన్యతే హతమ్‌ |
ఉభౌ తౌ న విజానీతో
నాయం హంతి న హన్యతే ||

తాత్పర్యము : జీవుడు చంపువాడని తలచువాడు గాని, చంపబడువాడని భావించువాడు గాని జ్ఞానవంతులు కారు. ఏలయన ఆత్మచంపదు మరియు చంపబడదు.

భాష్యము : ఎప్పుడైనా ఒక వ్యక్తి ఆయుధాలతో సంహరించబడినట్లయితే అతని శరీరమునందలి ఆత్మ సంహరింపబడదు. ఆత్మ ఎంతో సూక్ష్మమైనది కనుక ఏ భౌతిక ఆయుధము దానిని చంపజాలదు. అంతేకాక ఆత్మ ఆధ్యాత్మిక స్వభావమును కలిగి ఉన్నది కనుక చంపబడదు. ఇంకా చెప్పాలంటే కేవలము శరీరము మాత్రమే చంపబడుతుంది. అలా అని శరీరములను చంపుటను లేదా మార్పు చెందించుటను సమర్థించరాదు. శాస్త్రాల ప్రకారము ‘మా హింస్యాత్‌ సర్వభూతాని’ అనగా ఏ జీవరాశికి హాని కలిగించరాదు. అందుచేత ఆత్మ చంపబడదు కదా అని జంతువులను సంహరించుటప్రోత్సహించరాదు. ఉన్నత అధికారి ఆజ్ఞ లేకుండా ఎవరినైనా సంహరించుట చట్టరీత్యా, శాస్త్రరీత్యా శిక్షార్హము. అయితే అర్జునుడు క్షత్రియుడిగా తన కర్తవ్యాన్ని నిర్వహించుటకు యుద్ధము చేయవలసి వస్తున్నది గాని, ఇష్టానుసారము ఎవ్వరునూ హింసచేయరాదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement