అధ్యాయం 18, శ్లోకం 73
73.
అర్జున ఉవాచ
నష్టో మోహ: స్మృతిర్లబ్ధా
త్వత్ప్రసాదాన్మయాచ్యుత |
స్థితోస్మి గతసందేహ:
కరిష్యే వ చనం తవ ||
తాత్పర్యము : అర్జునుడు పలికెను : ఓ అచ్యుతా! నా మోహము ఇప్పుడు నశించినది. నీ కరుణచే నా స్మృతిని తిరిగి పొందితిని. ఇప్పుడు నేను స్థిరుడను, సందేహరహితుడను అయి నీ ఆజ్ఞానుసారము వర్తించుటకు సిద్ధముగా నున్నాను.
భాష్యము : ఈ శ్లోకము నందు మోహము అను పదము ముఖ్యమైనది. సహజముగా జీవుడు భగవంతుని దాసుడు. కాని తానే యజమానినని భావించి ఈ భౌతిక ప్రకృతిని అనుభవించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. దీనినే మోహము అందురు. అది కేవలము కృష్ణుని కృప లేదా ఒక శుద్ధ భక్తుని కృప ఉంటే గాని తొలగింపబడదు. అలా మోహము పొయిన పిమ్మట భగవంతుని ఆజ్ఞలను పాటించుటకు సిద్ధమగుదురు. అర్జునుడు భగవద్గీత విన్న తరువాత శ్రీకృష్ణుడు కేవలము తన స్నేహితుడే కాక దేవాది దేవుడైన భగవంతుడని అర్థము చేసుకున్నాడు. అనగా భగవంతుడైన శ్రీకృష్ణున్ని అర్థము చేసుకొనుటయే భగవద్గీతా అధ్యయనము యొక్క లక్ష్యము. చివరకు అర్జునుడు, శ్రీకృష్ణుడు యుద్ధము ద్వారా భూభారాన్ని తగ్గించదలచినాడని అర్థము చేసుకుని తన విల్లు, బాణములను చేత బట్టి యుద్ధమునకు సంసిద్ధుడయ్యెను.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..