Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 26
26
న బుద్ధిబేధం జనయేత్‌
అజ్ఞానాం కర్మసంగినామ్‌ |
జోషయేత్‌ సర్వకర్మాణి
విద్వాన్‌ యుక్త: సమాచరన్‌ ||

అర్థము : అజ్ఞాని ఫలాసక్తితో కర్మ చేయుచున్నప్పుడు, విద్యావంతుడు ఆ కర్మను విరమింపమని చెప్పి అతనిని కలతకు గురి చేయరాదు. అందుకు విరుద్ధముగా విద్యావంతుడు కూడా భక్తితో కర్మలు చేయుచూ అజ్ఞానిని కూడా వివిధ కర్మల యందు నియుక్తుడ్ని చేసి, అతనిలో క్రమేణా భగవద్‌ భక్తి పెంపొందేట ట్లు చూడాలి.

భాష్యము : వేదాలలో తెలుపబడిన కర్మల, యజ్ఞముల, దానముల, తపస్సుల యొక్క అంతిమ ప్రయోజనము శ్రీ కృష్ణున్ని అర్థము చేసుకొనుటయే. ఇంద్రియ తృప్తికి మించి ఏమీ ఆలోచించలేని అజ్ఞాని వాటిని సైతమూ ఇంద్రియ భోగమునకే ఆచరించును. అయితే వేదములలోని నియమ నిబంధనలను అనుసరించుట ద్వారా క్రమేణా పునీతుడై కృష్ణ చైతన్యమునకు ఉద్దరించబడుతాడు. కాబట్టి ఆత్మ జ్ఞానము కలిగిన వ్యక్తి అజ్ఞానుల కార్యాలను గాని లేదా భావనలను గాని నిరసించకుండా ఓపికతో వారి కర్మల ద్వారా వచ్చు ఫలితాలను కృష్ణుని సేవలో ఎలా వినియోగించవచ్చో తన ఉదాహరణ ద్వారా చూపించవచ్చును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement