అధ్యాయం 3, శ్లోకం 21
21
యద్యదాచరతి శ్రేష్ఠ:
తత్తదేవేతరో జన: |
స యత్ప్రమాణం కురుతే
లోకస్తదనువర్తతే ||
అర్థము : శ్రేష్ఠులైన మహనీయులు చేసే కార్యాలను సామాన్య జనులు అనుసరించెదరు. అలాగే వారు తమ ఆదర్శ ప్రవర్తన ద్వారా ఏ ప్రమాణమును నెలకొల్పెదరో దానినే లోకమంతయూ అనుసరించును.
భాష్యము : సామాన్య జనులకు ఆదర్శవంతమైన నాయకుడి అవసరం ఎల్లప్పుడూ ఉంటుంది. అట్టి నాయకుడు, ఎదుటి వారికి బోధించేముందు తాను పాటించితీరాలని, అపుడే అతడు ఆచార్యుడు కాగలడని శ్రీ చైతన్య మహాప్రభువు సూచించారు. అటువంటి ప్రతి ఆచార్యుడు, శాస్త్రాన్ని అనుసరించాలి. జీవితములో పురోగతి కోరుకునేవారు శాస్త్ర నియమాలను అటువంటి ఆచార్యుల అడుగుజాడలను పాటించి నేర్చుకోనవలసి ఉంటుంది. కాబట్టి రాజు, తండ్రి, ఉపాధ్యాయుడు వంటి వారు సహజ నాయకులు కనుక వారు శాస్త్రాన్ని నేర్చుకుని అందరికీ మంచి ఉదాహరణగా ఉండవలసిన గొప్ప బాధ్యత వారిపైన ఎంతైనా ఉంది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..