Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

ఓం శ్రీ పరమాత్మనే నమ:
అథ తృతీయో ధ్యాయ: – కర్మయోగ:
అధ్యాయం 3, శ్లోకం 1
01
అర్జున ఉవాచ
జ్యాయసీ చేత్‌ కర్మణస్తే
మతా బుద్ధర్జనార్దన |
తత్కిం కర్మణి ఘోరే మాం
నియోజయసి కేశవ ||

తాత్పర్యము : అర్జునుడు పలికెను : ఓ జనార్థనా ! కేశవా ! కామ్యకర్మము కన్నను బుద్ధియే శ్రేష్ఠమని నీవు భావించినచో ఎందులకు నన్ను ఇట్టి ఘోరమైన యుద్ధము నందు నియోగింపగోరుచున్నావు ?

భాష్యము : ఇంతకుముందు అధ్యాయములో కృష్ణుడు తన స్నేహితుడైన అర్జునుని దు:ఖాన్ని తొలగించుటకు ఎంతో విపులముగా ఆత్మ యొక్క జ్ఞానాన్ని వివరించెను. ఆత్మ సాక్షాత్కార మార్గముగా, బుద్ధి యోగము లేదా కృష్ణ చైతన్యమని తెలియజేయబడినది. అయితే కొన్నిసార్లు కృష్ణచైతన్యమంటే అన్నింటినీ వీడి ఏకాంతములో భగవంతుని నామాలను ”కృష్ణ, రామ” అని జపిస్తూ కూర్చోవటమని తప్పుగా అనుకుంటూ ఉంటారు. అది కేవలము ప్రజాకర్షణకే గాని మరి దేనికీ పనికిరాదు. అలాగే అర్జునుడు కూడా బుద్ధియోగము లేదా ఆధ్యాత్మిక పురోగతికి బుద్ధిని ఉపయోగించుట, అనునది వ్యవహారిక జీవితాన్ని వదిలి ఒంటరి ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేసుకొనుటగా భావించెను. ఈ విధముగా యుద్ధము వదిలి వెళ్ళదలచెను. అయితే ఒక మంచి శిష్యునిగా తన సందేహములను గురువైన కృష్ణుని ముందు ఉంచి ఆయన నిర్ణయాన్ని వినదలచెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement