అధ్యాయం 2, శ్లోకం 64
64
రాగద్వేషవియుక్తైస్తు
విషయానింద్రియైశ్చరన్ |
ఆత్మవశ్యైర్విధేయాత్మా
ప్రసాదమధిగచ్ఛతి ||
తాత్పర్యము : కాని సమస్త రాగద్వేషముల నుండి ముక్తిపొందినవాడును మరియు విధి నియమముల ప్రకారము వర్తించుట ద్వారా ఇంద్రియములను అదుపు చేయగలిగినవాడును అగు మనుజుడు భగవానునిసంపూర్ణ కరుణను పొందగలుగును.
భాష్యము : మనము ఇంతకు ముందే చర్చంచుకున్నట్లు కృత్రిమమైన పద్ధతుల ద్వారా ఇంద్రియములను నిగ్రహించుటకు ప్రయత్నించినట్లుయితే భగవద్భక్తి లేని కారణమున ఏ సమయములోనైనా పతనము చెందవచ్చు. అందుకు విరుద్ధముగా కృష్ణ చైతన్య భక్తుడు ఇంద్రియ భోగ వస్తువుల సమక్షములో ఉన్నట్లు కనిపించినా అతడు భగవంతుడు కోరుకుంటే కష్టమైన దానిని సైతమూ చేయటానికి సిద్ధపడతాడు. లేనిదే తనకిష్టమైన దానిని కూడా చేయడు. అతడు కృష్ణుని ఆదేశానుసారమే ప్రవర్తిస్తాడు. కృష్ణుడి సంతృప్తే తన సంతృప్తి కాని మరే ధ్యాసా ఉండదు. కాబట్టి భక్తునికి ఇంద్రియ భోగముల పట్ల ఆకర్షణ ఉన్నా కృష్ణుని కృపకు పాత్రుడై ఇటువంటి చైతన్యము పొందగలుగుతాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..