Tuesday, November 26, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యయం 6, శ్లోకం 01,
1.
శ్రీ భగవాన్‌ ఉవాచ
అనాశ్రిత: కర్మఫలం
కార్యం కర్మ కరోతి య: |
స సన్న్యాసీ చ యోగీ చ
న నిరగ్నిర్న చాక్రియ: ||

తాత్పర్యము : శ్రీభగవానుడు పలికెను : కర్మ ఫలముల యెడ ఆసక్తిని గొనక చేయవలసిన కార్యములను నిర్వహించువాడే సన్యాసికాగలడు. అతడే నిజమైన యోగి. అంతేగాని కేవలము అగ్నిని రగిలింపక మరియు కర్మలను చేయక ఉండేవాడు యోగి కాజాలడు.

భాష్యము : ఈ అధ్యాయములో కృష్ణుడు అష్టాంగ యోగ పద్ధతి ద్వారా మనస్సును ఇంద్రియములను ఎలా నిగ్రహించువలెనో తెలియజేయుచున్నాడు కాని కర్మ యోగము లేదా కృష్ణభక్తి రసభావిత కర్మయే శ్రేష్టమైనదని నొక్కి చెప్పుచున్నాడు. మరొక రకంగా చెప్పాలంటే కృష్ణుని తృప్తి కొరకు కర్మ నొనరించు వ్యక్తియే సంపూర్ణ యోగి, సంపూర్ణ సన్యాసి. ప్రతి జీవి కృష్ణుని యొక్క అంశయే కాబట్టి కృష్ణభక్తి రసభావిత కర్మ లేదా కృష్ణుని ప్రీత్యర్థమే కర్మనొనరించుట ప్రతి జీవి యొక్క ధర్మము. అదియే జీవితము యొక్క సాఫల్యత. కొన్ని సమయాలలో సన్యాసులు నిరాకార బ్రహ్మములో లీనమగుటను కోరుకొందురు మరియు యోగులు సగం మూసిన కన్నులతో పాటు చేయు యోగము స్వీయ లాభము కొరకై యుండును. కేవలము కృష్ణభక్తి భావన యందున్న వాడు మాత్రమే భగవంతుని సంతృప్తి కొరకు కర్మనొనరించును. కావున అతడే సంపూర్ణ సన్యాసి.

Advertisement

తాజా వార్తలు

Advertisement