అధ్యాయం 4, శ్లోకం 42
తస్మాదజ్ఞానసంభూతం
హృత్స్థం జ్ఞానాసినాత్మన: |
ఛిత్త్వైనం సంశయం యోగమ్
ఆతిష్ఠోత్తిష్ఠ భారత ||
తాత్పర్యము : కావున అజ్ఞానము వలన హృదయమునందు కలిగిన సంశయములను జ్ఞానఖడ్గముచే చేదించివేయుము. ఓ భారతా! యోగ సమన్వితుడవై యుద్ధము చేయుటకు లెమ్ము!
భాష్యము : ఈ అధ్యాయములో తెలియజేయబడిన యోగ పద్ధతిని సనాతన యోగము అందురు. అనగా సనాతనముగా, శాశ్వతముగా జీవుడు చేయవలసిన కర్మలు అని. దీనిలో రెండు భాగాలున్నాయి. మొదటిది భౌతికమైన సంపదలను దాన ధర్మాలు చేయుట వంటిదైతే రెండవది ఆత్మజ్ఞానసముపార్జన. ఇది ఆధ్యాత్మికమైనది. భగవద్గీతను అనుసరించేవారు ఈ రెండు విభాగాలను సులభముగా అర్ధము చేసుకొనగలరు. వీటన్నింటి ముఖ్య ఉద్దేశ్యము ఆత్మ సాక్షాత్కారము పొందుతున్నామా లేదా అనేది. దీనిని కోరుకునేవాడే నిజమైన భగవద్గీతా విద్యార్ధి. కాబట్టి ప్రామాణికుడైన గురువును సమీపించి సరైన ప్రశ్నలను అడిగి, సేవ చేసి ఈ జ్ఞానమును నేర్వవలసి యున్నది. అటువంటి గురువు, అనాదిగా వస్తున్న భగవద్గీతా సందేశాన్ని తూ చా తప్పకుండా పాటించే వాడై ఉంటాడు. భగవద్గీతా జ్ఞానముపై విశ్వాసము లేని వ్యక్తి భగవంతుడు ఇచ్చిన స్వల్ప స్వాతంత్య్రాన్ని దుర్వినియోగము చేసుకున్న వాడే అవుతాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..