Tuesday, November 19, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 5, శ్లోకం 18.

విద్యావినయసంపన్నే
బ్రాహ్మణ గవి హస్తిని |
శుని చైవ శ్వపాకే చ
పండితా: సమదర్శన: ||

తాత్పర్యము : వినమ్రులైన యోగులు యథార్దమైన జ్ఞానము కలిగినవారగుటచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, కుక్కను, కుక్క మాంసము తిను (చండాలుని) సమదృష్టితో చూడగలరు.

భాష్యము : కృష్ణ చైతన్య వంతుడు వేరు వేరు కులాల మధ్యగాని, జీవరాశుల మధ్య గాని తారతమ్యాన్ని చూపడు. శారీరకముగా చూసినట్లయితే ఒక బ్రాహ్మణుడు, చండాలుడు, కుక్క, ఆవు మరియు ఏనుగు వేరు వేరుగా కనిపించవచ్చును. అయితే ఈ శరీరాలు భౌతికమైన త్రిగుణాలచే పొందబడినవి. నిజానికి వీరందరిలోనూ ఆత్మ, పరమాత్మలు ఉంటాయి. జ్ఞానములో ఉన్న వ్యక్తి వారిలోని ఆత్మ, పరమాత్మలను చూసి అందరినీ సమానంగా చూస్తాడు. భగవంతుడు అందరి శ్రేయోభిలాషి అగుటచే వారి శరీర పరిస్థితులను అతీతంగా పరమాత్మ రూపములో అన్ని జీవరాశుల యందును నివసించును. ఆత్మ మరియు పరమాత్మ రెండును ఆధ్యాత్మికమైనవి, శాశ్వతమైనవి మరియు ఆనందదాయకమైనవి. అయితే ఆత్మ యొక్క పరిధి ఆ శరీరమునకే పరిమితమైతే, పరమాత్మ అన్ని శరీరముల పట్ల అవగాహన కలిగి ఉంటాడు. జ్ఞానవంతుడు ఈ విధమైన దృష్టి వలన సమానత్వాన్ని కలిగి ఉంటాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement