Saturday, November 23, 2024

గీతాసారం (ఆడియోతో…)

ఆధ్యాయం 6, శ్లోకం 35

శ్రీ భగవాన్‌ ఉవాచ
అసంశయం మహాబాహో
మనో దర్నిగ్రహం చలమ్‌ |
అభ్యాసేన తు కౌంతేయ
వైరాగ్యేణ చ గృహ్యతే ||

తాత్పర్యము : శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ గొప్పభుజములు కలిగిన కుంతీపుత్రా! చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా చాలా కష్ఠతరమైనను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును.

భాష్యము : ఇక్కడ శ్రీకృష్ణుడు సైతమూ ఈ యోగ పద్ధతి దుర్లభమైనదేనని అర్జునునితో ఏకీభవించుచున్నాడు. దానికి ఒక మార్గాన్ని కూడా సూచించుచున్నాడు. భగవత్‌ సంబంధ కార్యాలను చేయుట ద్వారా, సరైన అభ్యాసము మరియు భగవత్‌ సంబంధం లేని కార్యాల నుండి దూరముగా నుండుట ద్వారా వైరాగ్యమును పాటించినట్లయితే మనస్సును నిగ్రహించుట సాధ్యమగును. ఆకలిగొన్న వ్యక్తి ప్రతి అన్నపు ముద్ద ద్వారా ఏవిధముగా సంతృప్తిని పొందుతాడో అదే విధముగా భగవంతుని గురించి వినుట ద్వారా వ్యక్తి సరైన సాధన చేస్తూ భగవంతుని పట్ల అనురాగాన్ని పెంపొందించుకొనుటచే సహజముగానే వైరాగ్యాన్ని కూడా అలవరచుకొంటాడు. ఉన్మాద మనస్సుతో బాధపడుచున్న రోగికి శ్రీకృష్ణుని గురించి వినుట మంచి మందు అయితే, కేవలము కృష్ణునికి అర్పించిన ఆహారాన్నే భుజించుట సరైన పత్యము. వీటిని పాటించి నట్లయితే తప్పక అతని రోగము నయమగును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement