Tuesday, November 26, 2024

భద్రప్రదాయిని…రుద్రగీత

”గీతా గంగాచ గాయత్రీ గోవిందేతి హృది స్థితే
చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్యతే”.
‘గ’ అనే అక్షరంతో మొదలయ్యే పదాలు నాలుగింటిని ఎవడు నిరంతరము తన మనసులో నిలిపి ఉంటాడో అతనికి పునర్జన్మ లేదని మహాభారతం చెప్పింది. ఆ నాలుగు పదాలు—’గీత’, ‘గంగ’, ‘గాయ త్రి’, గోవింద’ అనేవి. అంటే గీతాధ్యయనము, గంగాస్నానము, గాయ త్రీ మంత్ర జపము, గోవిందనామ స్మరణ అన్నవి మానవ జీవితంలో అతి ముఖ్యమైనవి అన్నమాట.
‘గీత’ అంటే పాడబడినది అని అర్థం. ఎవరు గానం చేశారో వారి పేరిట లోకంలో అనేక గీతలు వెలసి ఉన్నాయి. అష్టావక్ర గీత, అవధూత గీత, ఋభుగీత, బ్రహ్మ గీత, వసిష్ఠ గీత, అనుగీత, గణశగీత, హనుమ ద్గీత, పరాశర గీత, హారీత గీత, శివగీత, ఋషభగీత, హంసగీత, భిక్షుగీత, కపిలగీత, దేవగీత, రుద్రగీత, భగవద్గీత, రమణగీత లాంటి అగణితములైన గీతలు విశ్వసాహత్యంలో వెలసి ఉన్నాయి. అన్నిం టిలో తెలుసుకోదగిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. అయితే కురుక్షేత్ర యుద్ధ ప్రారం భానికి ముందు శ్రీకష్ణుడు అర్జునునకు ఉపదేశించిన భగవద్గీ త విషయ గాంభీ ర్యము, చక్కని కవితాశైలి, పలు అంశాల వలన ఇతర గీతలకంటే ప్రజల హృదయాలకు మిక్కిలి చేరువైంది.
భగవద్గీత మహాభారతాంతర్గతం కాగా, మహాభాగవతం చతుర్థ స్కంధంలో ‘రుద్రగీత’ మనకు కానవస్తుంది. రెండూ వేదవ్యాస విర చితాలే. మొదటిది మహావిష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుని చేత బోధిం పబడితే, రెండవది సాక్షా త్తు పరమేశ్వరుని చేతనే బోధింప బడింది. భగవద్గీత అర్జునునికి, రుద్రగీత ప్రచేతసులు అనబడే వారికి బోధింప బడింది. నవవిధ భక్తిమార్గాలుగా చెప్పబడిన శ్రవణం, కీర్త నం, స్మర ణం, పాదసేవనం,అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేద నం అనే తొమ్మిదింటిలో గీతను గానం చేయడం లేదా వినడం అనే రెం డు మార్గాలూ మోక్షానికి సులువుగా దగ్గరగా తీసుకువెళ్ళే మనోజ్ఞ మార్గాలు అంటారు.
భగవద్గీత అద్వైతామృత వర్షిణి. జీవునికీ, దేవునికీ భేదం లేదని తెలియజేస్తుంది. అలాగే ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాలు మూడింటికీ ఆమోదమైనది. రుద్రగీత హరిహరాద్వైతాన్ని చాటి చెప్పేది. సాక్షాత్తు పరమేశ్వరుడే విష్ణు మహత్వాన్ని ఉపదేశించగా, దానిని ”జపధ్యాన పూజా నియమంబుల సేవింపుచూ పదివేల సంవత్సరంబులు నారా యణుని” ప్రచేతసులు పూజించి తరించిన గాథ ఇది. ”శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణో: విష్ణోశ్చ హృదయం శివ:” అనిన రీతిలో శివుడు తనకూ, విష్ణువుకూ భేదం లేద నడానికి సాక్ష్యంగా విష్ణు స్తోత్రాన్ని ప్రచేతసులకు ప్రసాదించాడు రుద్ర గీతలో. దానిని నియమంగా పఠించిన వారికి నిముషంలో మోక్షం వస్తుందని సెలవిచ్చాడు. అయితే నిముషంలో లభించే ఆ మోక్షాన్ని పొందడానికి మానవుడెంత శ్రమించాలో రుద్రగీత వివరిస్తుంది.
సంస్కృత భాగవతంలో 57 శ్లోకాలుగా విస్తరించి ఉన్న ఈ రుద్రగీతను పోతన మహాకవి 37 పద్య, గద్య మిశ్రిత చంపువుగా, చాలా సరళంగా ఆంధ్రీకరించాడు. ఆంధ్ర మహాభాగవతంలోని చతుర్థ స్కంధంలో 698వ పద్యం నుండి 734వ పద్యం వరకు రుద్రగీత మన కు అందించబడింది. ముక్తి పొందడమంటే స్వర్గ సుఖాల ననుభవిం చడంకాదు. అంత కన్నా శ్రేష్ఠ మైనది. ”స్వధర్మ నిరతుండైన పురుషుడు అనేక జన్మాంతర విశేషంబున చతుర్ము ఖత్వంబు నొంది, తదనంతరం బున పుణ్యా తిరేకంబున నన్ను పొంది, అధి కారాంతం బున నేను, దేవతాగణంబు లు, నవ్యాకృతంబైన ఏ పదంబులు పొందుదుము అట్టి పదంబు భాగవత తుండు తనంతనే పొందును. కావున మీరు భాగ వతత్వంబు నొందుటన్‌ చేసి నాకున్‌ ప్రియులై యుండుదురు” అని రుద్రుని వచనము. కనుక ముక్తి అన్నది జన్మజ న్మల పుణ్యఫలంగా లభించేది. ప్రతి జన్మలోనూ పూర్వజన్మ వాసనలను వది లించుకొంటూ, అరిషడ్వర్గములకు లొం గక, పుణ్యమార్గంలో ముందుకుసాగాలి. ఆ మార్గంలో ప్రకృతి రూపంలో మనల్ని ప్రలోభ పరచే విష్ణుమాయకు లొంగ రాదు. భక్తితో ఆ మాయామోహాలను జయించు తూ ముందుకు జ్ఞానమార్గంలో సాగాలి.
ప్రాచీనబర్హి కి శతధృతి యందు జన్మించిన పదిమంది కుమారులు ప్రచేత సులు అని పిలువబడే ధర్మజ్ఞులు. తండ్రి మాట మేరకు వారందరూ తపస్సు చేయ డానికి అడవికి వెడుతున్న సందర్భంలో వారికి మనోహర, నిర్మల జలపూరితమైన, విశాలమైన సరోవరము కన్పించింది. అది ”సజ్జనుని హృదయమును బోలి స్వచ్ఛమగుచు, హరి పదాకృతి విజయ విహారమగుచు, ఘనుని సిరిభంగి నర్హజీవ నమగుచు, మాన వతి వృత్తి గతిని నిమ్నంబగుచు’ కనిపించింది. ఆ సరస్సు ఈ ప్రపం చానికి ప్రతీక. ఈ ప్రపంచం అలా ఉండాలని కవి భావం. ఈర్ష్యాద్వే షాలు, కక్షలు కార్పణ్యాలు లేకుండా, మంచివాని మనస్సులాగా ఈలోకం నిర్మలంగా, స్వచ్ఛంగా ఉండాలి. ఎక్కడ అలా ఉంటుందో అక్కడ దేవతలు విహరిస్తారు. ఎక్కడైతే స్త్రీలకు సముచిత గౌరవం లభిస్తుందో అక్కడ దేవతలు నివసిస్తారు. అలాంటి దేవతా విహార భూమిగా ఈలోకం విలసిల్లాలి. గొప్పవాని వద్ద ఉన్న సంపద సద్వి నియోగం అవుతుంది. గుణవతులైన స్త్రీల మనస్సు ఎప్పుడూ గంభీ రంగా ఉంటుంది. అటువంటి ప్రపంచంలో ఉంటే మానవులందరూ దేవతలతో సమానులవుతారు. ఆ తర్వాత రుద్రులు అవుతారు. చివర కు విసాయుజ్యం పొందుతారు. వ్యాస విరచితమైన మహాభాగవతాన్ని తెనిగించిన పోతనామా త్యుడు తేనెసొనల వంటి తన కవితాధారతో, చతుర్థస్కంధంలో రుద్ర గీతను మనకు తెలుగులో ప్రసాదించాడు. ఈ రుద్రగీతా పారాయణం సర్వశ్రేయోదాయక.
మహాభారతంలోని అనుశాసనిక పర్వం చతుర్థాశ్వాసంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడు, నారద ప్రోక్తమైన ఉమామహశ్వర సంహతలో శివుడు పార్వతికి చెప్పినట్లుగా ఉన్న అనేక ధార్మిక విష యాలను, సాంఖ్య యోగశాస్త్రాలను, శివ విష్ణు పూజా విధానాలను, విశేషాలను ధర్మరాజుకు వివరిస్తాడు. ఆ భాగం కూడా ‘రుద్రగీత’ గా కొందరు అభిప్రాయ పడుతున్నారు. కానీ మహా భాగవతంలోని రుద్రగీతే ప్రమాణికమని కొందరు విశ్వసిస్తున్నారు. రెండూ కూడా విష్ణు, రుద్ర, తత్వ రహస్యాలనూ, మరెన్నో ధర్మ సందేహాలకు సమాధానాలనూ తెలియజేసే మానవ జీవన మార్గదర్శులే. వాటిని అవగతం చేసుకొని, పాటించి తరించడమే మన కర్తవ్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement