ఆరో రోజుకు చేరిన శారదీయ నవరాత్రి ఉత్సవాలు
బాసర పుణ్యక్షేత్రంలో దర్శనానికి బారులు తీరిన భక్తులు
ఆంధ్రప్రభ స్మార్ట్, బాసర : నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలోని జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారి సన్నిధిలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఈ ఉత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. కాత్యాయని అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇచ్చారు. అమ్మవారికి అర్చకులు విశేష మల్లెపూలతో పుష్పార్చన నిర్వహించి రవ్వ కేసరీ నైవేద్యంగా సమర్పించారు.
పోటెత్తిన భక్తులు
బాసర పుణ్యక్షేత్రంలో అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామున ఐదు గంటల నుంచి భక్తులు బారులు తీరారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి నది తీరాన గల శివాలయంలో అభిషేక అర్చన పూజలు చేశారు. అనంతరం భక్తులు తమ చిన్నారులకు ఆలయంలోని అక్షరాభ్యాస మండపంలో అక్షరభ్యాస పూజలు జరిపించి ఆలయంలో కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి సన్నిధిలోని నిత్యాన్నదన సత్రంలో భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు.