హిరణ్యాక్షుడు, హరణ్యకశిపుడు రాక్షస సోదరులు. వీరు చేయని అకృత్యాలు లేవు. ఒకసారి హరణ్యాక్షుడు భూమిని అంతటిని చాపలాగ చుట్టేసి, పాతాళానికి తీసుకుని పోవాలని, సముద్ర గర్భంలో దాక్కొన్నాడు. సృష్టి కార్యం ఆగిపోయింది. బ్రహ్మ, బ్రహ్మ మానస పుత్రులు, సప్త ఋషులు అంతా, విష్ణుమూర్తిని సందర్శించి విషయాన్ని తెలిపారు.
అప్పుడు, విష్ణువు యజ్ఞ వరాహ అవతారం ఎత్తి, భూమిని పైకి తెచ్చి, తన వాడై న కోరలతో పొడిచి, హరణ్యాక్షుడను సంహరించాడు. హరణ్యకశిపుడు సోదరుడి అంత్యక్రియలు చేసి, తన తల్లి దితిని, భార్యలను, అతని కొడుకులు అయిన శకుని, శంబర, కాలనాభ, మరోత్కచ ప్రముఖులను ఓదార్చాడు. అయినా తల్లి దితి ఇంకా విచారిస్తూంటే, ”తల్లిd! లోకం చలిపందిరి వంటిది. ప్రాణులందరూ దాహార్తి కోసం వచ్చి వెళ్ళిపోతూంటారు. మనం కూడా ఈ సంసారంలోకి వచ్చి, పని పూర్తవగానే వెళ్ళిపోతూంటాము. మాతా! నీ చిన్న కుమారుడు జగదేకవీరుడు. కాబట్టే వీర స్వర్గం అందుకొన్నాడు. నీవు వీరమాతవు. దు:ఖించకు! అని ఓదార్చాడు. అమ్మా! భగవంతుడు నిరాకారుడు. ఈ లక్షణాలతో, ఈ గుణాలతో ఉంటాడని నిర్థారణ చేయ లేము. కాని అప్పుడప్పుడు కొన్ని లక్షణాలు జీవులకు కల్పించి, సంసార బంధా లలో చిక్కుకొనేటట్లు చేసి యోగ- వియోగాలు అనుభవింప చేస్తాడు. పుట్టుక, వినాశం, శోకం, వివేకం, చింత, స్మరణ అనేవి అనేక విధాలు. ఈ పరమార్థాన్ని వివరిం చడానికి పెద్దలు ప్రేత బంధు అనే సంవాదం చెపుతుంటారు. నీకు ఆ సంవాదం వినిపిస్తు న్నాను. ఆలకించు” అంటూ ప్రారంభించాడు.
”ఉశీనర అనే దేశంలో ”సుయజ్ఞ” అనే రాజు ఉండేవాడు. అతడు ఒక యుద్ధం లో శత్రువుల చేతికి చిక్కి, మరణించాడు. ఆ మహారాజు రత్నకవచం చిదిగిపోయిం ది. ఖడ్గం విరిగిపోయింది. రత్నహారాలు చెల్లాచెదరైపోయాయి. భయంకరమైన, వాడి అయిన బాణముల దెబ్బలకు ఆయన వక్షస్థలం గాయపడింది. కళ్ళలో కదలికలేదు. కళ్ళు రెప్పపాటు లేకుండా నిశ్చలంగా ఉన్నాయి. దీర్ఘములైన అతని బాహువులు తెగి నేలమీద పడ్డాయి. విగతజీవుడైన ఉశీనర నగర రాజు చుట్టూ చేరి, అతని భార్య, పుత్రులు, బంధువులు, మిత్రులు విలపించసాగారు. హా! నాథా! అని భర్త పాదాలపై పడి అనేక విధాల గత స్మృతులను తలచుకొని దు:ఖించసాగారు. కన్నీరు మున్నీరుగా రోదించసాగింది. అంతదు:ఖంలోను ”పాప రహతుడా! ప్రజ లను సంపదలతో, సంతోషంతో, పరిపాలించడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు. ఆ చతుర్ముఖుడే ఈనాడు నిన్ను నిర్దయగా మరణింపచేసాడు. ఇక ఈ ప్రజలకు, నీ పుత్రులకు, ఆధారం ఎవరు! దిక్కు ఎవరు? ఓ! మహపాలా! నీ వంటి వ్యక్తి- జనుల కు, బంధువులకు, పుత్ర మిత్ర కళత్రాదులకు దు:ఖం మిగిల్చి వెళ్ళవచ్చునా? ఓ! ప్రాణనాథా! నీ వియోగంలో క్షణాలు సంవత్సరాలుగా భారంగా గడుస్తున్నాయి. పరలోకం నుండి నీవు తిరిగి రాకపోతే, మాకు ఈ లోకంతో పనేముంది? మేము ఎలా బ్రతక గలం. నీవు లేని ఈ లోక జీవనం, సంపద, మాకు అక్కర్లేదు. అగ్నిలో సహగ మనం చేసి, మేము నీ చరణ సన్నిధికి చేరుకొంటాము.” అని ఈ విధంగా సుయజ్ఞును ని భార్య, పుత్రులు విలపిస్తున్నారు. ఇంతలో సూర్యుడు అస్తమించే వేళయ్యింది.
ఆ సమయంలో వారి రోదన విని బ్రాహ్మణ వేషంలో ఉన్న యమధర్మరాజు, వారి దగ్గరకు వచ్చి, ఓదారుస్తూ ఇలా చెప్పాడు. ”ఓ! అజ్ఞానులారా! ఎక్కువ మక్కువ పెంచుకొని కాలం తీరిపోయిన వారి కోసం ఇంతగా దు:ఖించడం చోద్యంగా ఉంది. దేహం ధరించిన ప్రతి జీవి పుట్టడం, గిట్టడం సహజం. మీరంతా నిత్యం చూస్తూనే ఉంటారు కదా! మీరు వాస్తవం తెలుసున్నా, మరణించిన వారి కోసం విలపిస్తా రేమిటి?
మృత్యువును తప్పించుకోవడం ఎవరికీ సాధ్యంకాదు కదా! ప్రాణి ఎక్కడ నుండి వచ్చాడో, అక్కడికి చేరిపోవడం తప్పనిసరి. ఈ విశ్వాన్ని రక్షించేది- సృష్టించే ది- నశింపచేసే అనంత మూర్తి ఎవరో? బ్రహ్మాండానికి అధిపతి ఎవరో, వాడే లీలా విలాసంగా ఈ లోకాన్ని రక్షిస్తూ పోషిస్తున్నాడు. ధనాన్ని వీధిలో పడవేసినా- దైవ యోగం బాగా ఉంటే సురక్షితంగా ఉంటుంది. గీత బాగుండకపోతే ఇంట్లో ఎంతో భద్రంగా దాచినప్పటికి మటుమాయం అవుతుంది. అలాగే దుర్భలుడు అడవిలో ఉన్నా భగవంతుని కృప ఉంటే ఆయురారోగ్యాలు పొందుతాడు. అది లేనివాడు సౌధాలలో పలు రక్షకభటులు రక్షింపబడుతున్నా, రాజైనా సరే మరణిస్తాడు.
భగవంతుని తత్త్వం ఎవరికి అర్థంకాదు. ఈ ప్రాణికోటి కాలానికి, కర్మకు వశమై పోయి, ఈ కాలచక్రంలో ప్రవర్తిల్లుతూంటారు. మానవుని శరీరం పంచభూతాత్మక మైనది. భూమి నుండి చర్మం, నీటినుండి రక్తం, మూత్రం వంటివి, అగ్ని నుండి దా#హం, ఆకలి వంటివి, గాలి నుండి కదలడం, నడవడం, వంటివి, ఆకాశం నుండి కామ,క్రోధాలు, ఏర్పడతాయి. ఇవన్నీ కలిస్తేనే మానవ శరీరం. ఓయి! మీకేమైనా వెర్రిపట్టిందా? ఈ భూపాలకుడు శాశ్వతంగా నిద్రిస్తుంటే పిచ్చిగా విలపిస్తారేమిటి? ఇతనిలోని జీవుడు మాత్రం ఎప్పుడో వెళ్ళిపోయా డు. వానికోసం మీరు బాధపడటం, దు:ఖించడం ఏమీ బాగాలేదు. ఈ మాయా ప్రపంచం రహస్యం తెలుసుకొన్న మునులు, జ్ఞానులు, అశ్వాశ్వతమై న వాటి గురించి దు:ఖించరు.
శాశ్వతమైన వాటి గురించి సంతోషించరు. వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికి తెలియదంటారు. మృత్యువు ఏ రూపంలో వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎవరికీ తెలియదు. దు:ఖితులారా! మీరు చింతించకండి.చనిపోయిన వారు మళ్ళీ జీవిస్తారా? ” ఈ విధంగా యముడు రూపంలో ఉన్న బాలకుడు చెప్పిన ఊరడింపు మాటలు విని సుయజ్ఞుని బంధువులు, భార్యాపుత్రులు అందరూ శోకం మాను కొన్నారు. ప్రాణులకు పరతత్త్వచింతన లేకపోవడం వల్ల మనవాళ్ళు అని, ఇతరులు అని, తేడాగా భావిస్తూంటారు. ఆలోచిస్తే అందరూ ఒకటే సుమా!” అంటూ హరణ్యకశిపుడు బోధించాడు.
తనయుడు బోధన విని తల్లి దితి, కోడళ్ళు, అందరూ బాధను దిగమింగి తత్త్వం తెలుసుకొన్నారు.
సుయజ్ఞోపాఖ్యానం
Advertisement
తాజా వార్తలు
Advertisement