Saturday, November 23, 2024

సర్వసమతా దృష్టే ఆత్మసందర్శన హేతువు

గంగానదీ దక్షిణ తీరాన మహాపద్మమనే నగరంలో, భృగుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఉత్తముడు. ధర్మ నిత్యుడు. అహంసా పరుడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు. క్రోధం ఎరుగక తన కర్మాచరణ పట్ల తృప్తి కలిగినవాడు.
న్యాయంగా లభించిన ధనంతో దేవకార్యాలు, పితృకార్యాలు అతిథి సత్కారాలు నిర్వరిస్తూండేవాడు. అతడికి ఎప్పుడూ ఒకేరకమైన ఆలోచన.ఏవి మంచి పనులు? వేటిని ఆచరిస్తే మేలు? ధార్మికుడను ఎలా అవుతాను? నాకు ఆత్మ నిష్ఠ ఎలా కలుగుతుంది? అని చింతిస్తూ ఉండేవాడు.
ఒకరోజు ఒక ఉత్తమ బ్రాహ్మణుడు తన ఇంటికి అతిథిగా వచ్చాడు. మర్యాదలన్నీ పూర్తి కాగానే, భృగువు తన మనస్సులోని కోరికలను తెలియపర్చి, సందేహ నివృత్తి చేసి ఆత్మ సందర్శనం పొందే మార్గం విశిదపరచమని కోరాడు.
ఆయన ” ఓయీ! భృగూ! కొందరు బ్రహ్మచర్య ద్వారా, కొందరు గృహస్థాశ్రమ ధర్మం ద్వారా, తపస్సు ద్వారా కొందరు నిష్కర్మలతో కొందరు, యజ్జయాగాదులు చేసి మరికొందరు, ఇలా వివిధ సత్కర్మలు ద్వారానే ఆత్మసందర్శనం పొందుతూంటారు. మరి కొంతమంది తల్లిదండ్రులను సేవించి పొందితే, మరికొందరు శాంతి స్వభావులుగా, ఇంద్రియ నిగ్రహంతోను ముక్తిపథం పొందుతారు. నైమిశారణ్యంలో పవిత్ర గోమతీ నదీ తీరప్రాంతంలో ఓ తటాకం ఉంది. దాని ఒడ్డున ఒక సర్పం నివసిస్తోంది. అతడి పేరు పద్ముడు. అతడు ఉత్తముడు. దయాశీలి. అతనిని దర్శించి నీ సందేహం నివృత్తి చేసుకోమని సూచించి వెళ్ళిపోయాడు.
భృగువు ఆ ప్రాంతానికి బయలుదేరి, దారిలో పుణ్యతీర్థాలను సేవిస్తూ, అతిథి చెప్పిన పద్ముడు దగ్గరకు వచ్చాడు.
అప్పుడు ఆ నాగరాజు భార్య భృగువుకు అతిథి మర్యాదలు చేసింది.” ఏ పనిమీద వచ్చారో తెలియచేస్తే, ఆ పని చేస్తానని చెప్పగా, భృగువు ”నీ భర్తను కలిసి వెళ్ళడానికి వచ్చాను. ఆయన ఎక్కడ ఉన్నారో తెలియచేయమని కోరగా-
అప్పుడు ఆ సర్పకాంత ”ఓ ప్రసన్నమూర్తీ! నెలవారీ వంతు రావడంతో నా భర్త సూర్య రథాన్ని మోయడానికి వెళ్ళారు. (సూర్యరథం నాగేంద్రులే మోస్తారని పురాణం తెలుపుతోంది.) ఏడెనిమిది రోజుల్లో వస్తారు.” అనగానే, భృగువు ”తల్లి! నాగరాజు వచ్చేంతవరకు కనపడే వనంలో తపస్సు చేసుకొంటూ ఉంటాను. ఆయన రాగానే నాకు తెలపండి.”అని చెప్పి వెళ్ళిపోయి, తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఎనిమిదవ రోజున సర్పరాజు రాగానే, భార్య భృగువు రాకను గురించి తెలియపరచింది. నువ్వు అక్కడకు వెళ్లి ఏ కారణం వల్ల వచ్చారో తెలుసుకోమని చెప్పగా, క్రోధంతో ”ఓయీ! నెరజాణ! నేనా? ఇంకోచోటకు వెళ్లి ఎవరినో దర్శించడమా? దేవతలు, రాక్షసులు, మిగిలినవారు అందరూ నా పట్ల ఎంత గౌరవభావంతో ఉంటారో నీకు తెలుసు కదా! అది గుర్తుకు తెచ్చుకో. వాడెవడో దర్శనానికి నన్ను వెళ్ళమంటావేమిటి?”
అనగానే అతని భార్య శాంతచిత్తురాలై ”ధీరోత్తమా! నీ రాకకు ఎదురుచూస్తున్న బ్రాహ్మణుడి కోరికను తీర్చకపోవడం నీ వంటి ధర్మవేత్తకు న్యాయమా? ఒక బ్రాహ్మణుడిని నిరాశపరచి, ఆ పాపాఘ్నిలో నీ ముక్తిని, ఔచిత్యాన్ని, దయను,
ధార్మిక పాండిత్యాన్ని, తగలబెట్టుకొంటావా? ఓ! నాథా! మౌనం వలన ధృడజ్జానం, దానివల్ల అభ్యుదయం, ఆశలు తీర్చినందువల్ల నరకబాధ తొలగిపోయి, స్వర్గలోక శుభాలు లభిస్తాయని పెద్దలు చెబుతారు కదా! నీ రోషం చాలించు.” అని భార్య చెప్పిన ఉపదేశంతో నాగరాజు శాంతపడి, భార్యను మెచ్చుకొని, వడివడిగా వెళ్ళి భృగువును దర్శించాడు.
ఇద్దరూ చెట్లనీడలో కూర్చొని నాగరాజు ”పావనుడా! ఓ బ్రాహ్మణోత్తమా! నీవు నా రాకకు ఎదురుచూస్తూ, నిరాహారివై ఉండటానికి కారణం ఏమిటి? మీ కోరిక తెలిపితే నెరవేరుస్తాను.” అనగానే భృగువు దానికంటే ముందు నిన్ను ఒకటి అడగాలని నా మనస్సు తొలుస్తున్నది. అది అడుగుతాను. అంటూ ”ఓ! సర్పరాజా! నీవు సూర్య రథాన్ని మోయడా నికి వెళ్ళినప్పుడు నీవు చూచిన, విన్న అద్భుతాలను నాకు తెలియపర్చ”మని కోరగా, సర్ప రాజు ”బాహ్మణోత్తమా! ఆశ్చర్యాలన్నింటికి నిలయం ఈ విశ్వానికి వెలుగునిచ్చే సూర్యుడే! ఆయన వల్లనే సకల ప్రాణికోటి జీవిస్తున్నారు.
ఆయన ఒకవిధంగా ప్రాణదాత.ఆయనే లేకపోతే ఈ జగత్తు ఉండనే ఉండదు. ఆయన నుండి వెలువడే కిరణాల ప్రభావంవల్లనే పంటలు పండి ప్రజలకు జీవాధారమవు తున్నాయి. ఆయన నుండి వెలువడే వాయువు, సూర్య గోళంలో మధ్యలో ఉండే దట్టమైన కాంతితో కలిసి వర్షం కురుస్తుంది. వాలిఖ్యాలాది ఋషులు, సిద్ధులు, దేవతలు అందరూ
సూర్యకిరణాలలోనే, చెట్టుకొమ్మల మీద పిట్టలు నివశిస్తున్నట్లుగా ఉంటారు. ఇది ఆశ్చర్యం కాదా! పాప రహతుడా! సూర్యుని వేడిమి తగ్గిపోతే, ప్రజలలో ఆత్మనిష్ఠ అనేది శాశ్వతంగా ప్రకాశిస్తుంది. పరాత్పరుడైన శ్రీమన్నారాయణడు సూర్యమండలంలోనే ప్రకా శిస్తాడు. సూర్యుని వేడిమి తగ్గాలంటే, భౌతికంగా తపస్సు, సర్వసమతా దృష్టి ద్వారా మా త్రమే తగ్గించుకోగలము. మానవోత్తమా! ఒక రోజు ఒక దివ్య తేజస్వి ఎదురుగా వేగంగా వచ్చేసరికి, సూర్యుడు కౌగలించుకొని ఆయనలోనే ఐక్యమై పోయాడు ఇంటిలోకి ప్రవేశించి నంత సులభంగా. అపుడు మా సర్పరాజుల మందరం వచ్చిన వానిని గూర్చి తెలుసుకొ న్నాము. వచ్చినవాడు ఉంఛ వృత్తిలో జీవించే బ్రాహ్మణుడు. (ఉంఛ వృత్తి అంటే వరి పొలాల్లో పరిగి ఏరుకొని, వచ్చిన ధాన్యంతో అతిథి సత్కారాలు చేస్తూ తాము జీవించడం). సర్వభూత హతుడు. గొప్ప తపశ్శాలి. ధర్మానికి నిరతుడు సత్యశీలి. అలా సూర్య తేజస్సులో ప్రవేనించి సిద్ధిని పొందాడు. అని ఆయన గుణగణాలు వివరిస్తుంటే, భృగువు లేచి వెళ్ళిపోవడానికి సంసిద్ధుడు అవుతుండగా, నాగరాజు ”బ్రాహ్మణోత్తమా! ఇంతకీ మీరు వచ్చిన పని ఏమిటో తెలుపలేదు? చెట్టు క్రింద కాపురం ఉన్నవాడిలా లేచి వెళ్ళిపోవడం భావ్యమా? సమంజసమా? మీలో నేను, నాలో మీరు ఉన్నాము. మనచుట్టూ ప్రపంచ మంతా ఉంది. నిశ్చంతగా ఉండమని చెప్పగానే, భృగువు ”ఓ! సర్పరాజా! నువ్వు వాస్తవమే చెప్పావు. నీవు- నేను- ఈ ప్రాణికోటి- ఈ పంచభూతాలు అంతటా వ్యాపించి, ఏ బేధమూ లేని వాళ్ళం. అభిన్నులం. సమానం. నేను తెలుసుకోవాల్సిన విషయం తెలిసిపోయింది. ఇదే ఆత్మతత్త్వ దర్శనం. సర్వ సమతా దృష్టి. ఇక పై నేను అవలంబించేది ఈ వ్రతమే.” అని నాగరాజు ఆశీస్పులు పొంది భృగువు తన ఆశ్రమానికి బయలుదేరాడు.
మనం సకల భూత సమభావాన్ని కలిగి, ధర్మంగా జీవించడం వల్లనే, తారతమ్యాలు లేకుండా, ఉండడంతో మనకూ ఆత్మసంద ర్శనం యోగభాగ్యం కలుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement