వింధ్యాద్రిపై చెట్లన్నీ కొంగ్రొత్త చిగుళ్ళు తొడిగి చిగురించిన పచ్చదనంతో ఆ పర్వతానికే క్రొత్త అందాలను తెచ్చిపెడుతున్నాయి. పర్వత సమీపాన నెమ్మదిగా ప్రవహిస్తున్న సెలయేళ్ళ అలల సవ్వడి మనోహరమైన ప్రణవనాదాన్ని పలికిస్తున్నది. తెరలుతెరలుగా వీస్తున్న మలయానిల ధ్వనులు మనోహరమైన అనుభూతిని ప్రసాదిస్తున్నాయి. తూర్పుకొండపై నుండి బయలుదేరిన సూర్యుడు అపరాహ్ణాన్ని సమీపిస్తున్నాడు. ఆ సమయంలో కాలోచిత కార్యాలను పూర్తిచేసుకున్న ముని బాలకులు ఇండ్లకు చేరుకుంటున్నారు.
శునకుడనే ముని కుమారుడు శౌనకుడు. కక్షసేనుడనే మునికుమారుడు అభిప్రతారి. ఇరువురూ తమ సంధ్యానుష్ఠానాదులను, వాయుదేవోపాసనను ముగించుకొని ఇంటికి చేరుకున్నారు. గురుపత్ని వారికి భోజనం వడ్డిస్తున్నది. ఆ సమయంలో గుమ్మంవద్ద ఒక బ్ర#హ్మచారి భిక్షకై నిలబడి ”హరిఓం నారాయణ” అన్నాడు. సాధారణంగా భోజన సమయంలో వచ్చిన అతిథిని అర్చించి, భోజనాదులు సమకూర్చాకనే కాని గృహస్థు భోజనం చేసేవారు కాదు. కాని వారు మాత్రం.. ”ఈ సమయంలో ఇక్కడ భోజనం దొరకదు వెళ్ళు” అన్నారు. ఈరోజుల్లో అలాంటి మాట సాధారణమే కాని ఆనాటి కాలంలో అలాంటి మాట అసహజం. కేవలం శరీరాన్ని నిలుపుకోవడానికి మాత్రం భిక్షను కోరే అతిథులను గౌరవించడం గృహస్థు ధర్మంగా పాటించబడేది. ”యథా మాతర మాశ్రిత్వ సర్వే జీవంతి జంతవా:, తథా గృహస్థ మాశ్రిత్వ సర్వే జీవంతి మానవా:” అన్నారు. తల్లిని ఆశ్రయించి జంతువులు ఎలాగైతే జీవిస్తాయో అలాగే మానవులు గృ#హస్థును ఆశ్రయించి జీవిస్తారనే ధర్మం ఆచరించబడేది. ఋషివాటికలో తనకు భిక్షను నిరాకరించడం అసంబద్ధంగా తోచిన ఆ బ్ర#హ్మచారి, వారికి దేవతోపాసన ఎలాఉండాలో తెలియచేసి మాత్రమే వెళ్ళాలని నిర్ణయించుకొని అక్కడే నిలుచుండిపోయాడు.
ఇంటివారు భోజనాదులు ముగించుకొని బయటకు రాగానే వారిని బ్రహ్మచారి.. మీరేదేవతను ఉపాసిస్తారని ప్రశ్నించాడు. దానికి వారు ”ప్రాణదేవతను” అనగా వాయుదేవుడినని బదులిచ్చారు. అంతటా వ్యాపించిన వాయువు నుండే జగత్తు ఆవిర్భవించింది. దానిలోనే లీనమౌతుంది… మీకది తెలుసా బ్రహ్మచారి ప్రశ్న. తెలుసు.. మునుల సమాధానం. మీరు బలిహారం కోసమై పెట్టిన ఆహారం ఎవరికోసం పెట్టారు.. బ్ర#హ్మచారి ప్రశ్న. వాయుదేవునికై.. మునుల సమాధానం. అంతటా వ్యాపించిన వాయువు మీలోనూ నాలోనూ ఉన్నది.. అలాంటప్పుడు మీరు మాత్రమే భుజించి నాకు పెట్టలేదు.. అంటే నాలోని వాయువును మీరు అవమానించినట్లే కదా.. ప్రాణరూపంలో సకల చరాచర జీవరాసిలో ఆత్మగా ప్రకాశించే పరమాత్మను ”సంవర్గ” అంటారు. ఏ దేవతకోసం ప్రపంచమే అన్నంగా ఉన్నదో.. ఏ దేవత ప్రపంచంకోసం అన్నంగా మారుతుందో ఆ దేవతనే మీరు అవమానించారు.. అన్నాడు బ్రహ్మచారి.
మునిబాలకులకు కనులు తెరుచుకున్నాయి. వారు ఉపాసించే దైవమే విశ్వమంతటా వ్యాపించి ఉన్నదనే జ్ఞానం కలిగింది. వారి దృష్టిలో జడత మాయమై చైతన్యవంతమయింది. ఉపాసన అంతరార్థం అవగతమయింది. బ్రహ్మచారిని సాక్షాత్తూ నారాయణునిగా భావించి ఆదరించారు. ఆకలిగొన్న వారి ఆకలిని తీర్చడమే తమ ఆరాధ్యదేవతను ఉపాసించడమనే సత్యాన్ని గుర్తించారు. దానినే ”వైశ్వదేవం” అంటారనే నిజాన్ని తెలుసుకున్నారు. బ్రహ్మచారికి భోజనం సమకూర్చి అర్చించారు.
నిజానికి ఉపనిషత్తులు చిన్న కథల ద్వారా గొప్ప సామాజిక సందేశాన్ని అందిస్తున్నాయి. ఆకలిగొన్న వారు ఇంటిముందు ఉన్న సమయంలో ఉన్నది పంచుకోవడమే కాని స్వార్థపరులై తమ భోజనం తామే తినేవారు పాపాన్ని మాత్రమే భుజిస్తున్నారని చెపుతుంది ఉపనిషత్తు. ఉపాసన అంటే.. ముక్కు మూసుకొని మూలన కూర్చోవడం కాదని.. చైతన్యవంతులై సమాజ స్రవంతిలో భాగస్వాములు కావాలని ప్రబోధిస్తున్నాయి ఉపనిషత్తులు. అంతటా వ్యాపించిన భగవంతుని తత్త్వాన్ని గుర్తించి ”లోకా:సమస్తా: సుఖినోభవంతు” అనే సత్యాన్ని మనసా వాచా కర్మణా ఆచరించమని ఉపదేశిస్తున్న ఉపనిషత్తుల ఆంతర్యాన్ని గ్రహించి మనమంతా సమాజ ఉన్నతికి పాటుపడాలని.. అదే భగవదుపాసన అని విశ్వసిస్తూ…
- పాలకుర్తి రామమూర్తి