Sunday, November 17, 2024

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ సేవలో అష్ట దిక్పాలకులు

ఏడుకొండల స్వామికి తొలిసారిగా బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటున్నది. నవాహ్నక దీక్ష తో, నవబ్రహ్మలు తొమ్మిది రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలని; తిరుమలలో పరబ్రహ్మ స్వరూపుడు, బ్రహ్మాది దేవతలచే కీర్తింపబడే కోనేటి రాయని బ్రహ్మోత్సవాలు నేటికీ ఘనంగా కొనసాగుతున్నాయి. వేంకటేశ్వరుడు అర్చనామూర్తిగా ఆవిర్భవించింది ఆశ్వయుజ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్ర శుభముహూర్తాన. రవి కన్యామాసంలో ప్రవేశించిన తరువాత వచ్చే శ్రవణా నక్షత్రం రోజున అవబృద కార్యక్రమాన్ని నిర్ణయించుకుని దానికి తొమ్మిది రోజులు నవాహ్నక బ్రహ్మోత్సవాలుగా నిర్వహిస్తారు. ధ్వజారోహణతో సకల దేవతలకు, అష్టదిక్పా లకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వ గణాలకు ఆహ్వానం పలుకుతూ ఉత్సవాలను ప్రారంభిస్తారు. ధ్వజావరోహణంతో ఆహ్వానితులైన దేవతలకు వీడ్కోలు పలికి ఉత్స వాలను ముగిస్తారు.
స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక నూతన వస్త్రం మీద గరుడుని బొమ్మ ను చిత్రీకరిస్తారు. దీన్ని ‘గరుడ ధ్వజ పటం’ అంటారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రం. బ్రహ్మోత్సవా లలో తొలి దినం వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా గరుడ కేంద్ర ప్రతిష్ట, కంకరణ ధారణ, ఆల య ఆవరణంలోను, బయట, చుట్టూ అష్ట దిక్కులలోనూ స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా సపరివార దేవతలతో ఊరేగుతూ ఉండగా అష్ట దిక్పాలకులు ఆహ్వానింప బడతారు. అనంతరం స్వామి వారు ఆలయంలో ప్రవేశించి ధ్వజస్తంభం దగ్గరకు చేరు కుంటారు. మిగిలిన పరివార దేవతలైన అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగదుడు విమాన ప్రదక్షణలో ఉన్న మండపంలోకి చేరుకుంటారు. తదుపరి శ్రీదేవి, భూదేవి, మలయప్ప స్వామి వారి సమక్షంలో వేద గానాల మధ్య మంగళ వాయిద్యాలు మ్రోగు తుండగా అర్చక స్వాములు ద్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని (గరుడ పటాన్ని ఎగురవేస్తారు) దీనితో ధ్వజారోహణ కార్యక్రమం పూర్తి అవుతుంది.
అయితే స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పుణ్య స్థలిలో ఎనిమిది దిక్కులలో కొలువై ఉండి, బ్రహ్మోత్సవాల విజయవం తంలో అష్ట దిక్పాల కులదే ప్రధాన పాత్ర. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం అనేవి నాలుగు దిక్కులు. ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం అనేవి నాలుగు మూలలు లేక నాలుగు విదిక్కులు. ఈ ఎనిమిదింటి ని కలిపి అష్టదిక్కులని పేరు. ఈ అష్టదిక్కులకు పాలకు లైన వారికి సంబంధించిన విశేషాలు…
ఇంద్రదేవుడు: అష్టదిక్పాలకులలో ప్రథముడు ఇంద్రుడు. దేవతలకు రాజుగా వేదాల్లో కీర్తించబడ్డాడు. ఇతను తూర్పు దిక్కునకు అధిపతి. అదితి కుమారుడు. ఇత ని భార్య శచీదేవి. ఆయుధం వజ్రం. వాహనం ఐరావతం. నివాసం అమరావతి. పాలసముద్రం నుండి పుట్టిన ఐరావతాన్ని, ఉచ్ఛైశ్రవ మనే గుఱ్ఱము ను ఇతడు గైకొన్నాడు.
అగ్నిదేవుడు: అగ్ని పంచమహాభూతాల్లో ఒకడు. ఆగ్నేయాధిపతి. తేజస్వి. సప్త హస్తములు, చతుశ్శంగములు, ఏడు నాల్కలు, రెండు శిరములు కలిగి శుభ్రమైన చిరునవ్వులు చిందించు స్వరూపం కలవాడు. ఇతని తండ్రిపేరు వైశ్వానరుడు. తల్లి శుచి ష్మతి. భార్య స్వాహాదేవి. ఆయుధం శక్తి. వాహనం పొట్టేలు. నివాసం తేజోవతి పట్టణం.
యమదేవుడు: యముడు పితృగణాధిపతి. దక్షిణ దిగ్భాగమున పరిపాలన ఇతనిదే. ఇతని తండ్రి సూర్యుడు. తల్లి సంజ్ఞాదేవి. భార్య శ్యామలాదేవి. ఆయుధం దండం. వాహనం మహేషం. నివాసం సంయమని పట్టణం.
నిరృతి దేవుడు: నిరృతి నైరుతి దిక్పాలకుడు. లోకాధి పతి. సత్పురుషుడు. కీర్తిమంతు డు. భార్య దీర్ఘాదేవి. ఆయు ధం కుంతము. వాహనం నరుడు. నివాసం కృష్ణాంగన పట్టణం.
వరుణ దేవుడు: యజ్ఞ సమయాల్లో హవిర్భాగములను ఇవ్వ డానికి ఆహ్వానింపబడే వరుణుడు పశ్చిమ దిక్పాలకుడు. జలాధిపతి. ఇతని తండ్రి కర్దమ ప్రజాపతి. భార్య కాళికాదేవి. ఆయుధం పాశము. వాహనం మొసలి. నివాసం శ్రద్ధావతి పట్టణం.
వాయు దేవుడు: వాయువు పంచభూతాలలో ఒకరు. సర్వ వ్యాపకుడు. మహా బలవంతుడు. వాయవ్య దిశకు అధిపతి అయిన ఇతడు జీవకోటికి ప్రాణాధికం. ఇతని భార్య అంజనాదేవి. ఆయు ధం ధ్వజం. వాహనం జింక. నివాసం గంధవతి పట్టణం.
కుబేర దేవుడు: కుబేరుడు సకల దేవతాప్రి యతముడు. ఉత్తర దిక్కునకు అధిపతి. ధనపతి. భాగ్యశాలి. కుబేరుని తండ్రి విశ్రవోబ్రహ్మ. తల్లి ఇల బిల. భార్య చిత్ర రేఖాదేవి. ఆయుధం ఖడ్గము. వాహనం గుఱ్ఱం. నివాసం అలకాపురి పట్టణం.
ఈశానుడు: సాక్షాత్తు ఈశాన్యాధిపతి పరమ శివుడు. జగదంబ పార్వతీదేవి ఇతని భార్య. ఆయు ధం త్రిశూలము. వాహనం వృషభము. నివాసం యశో వతి పట్టణం. పార్వతీ పర మేశ్వరులకు ఆది దంపతులని ప్రతీతి. శంకరుడు కోరినవారి కోరి కలు కాదనకుండా నెర వేర్చడం చేత ఇతనికి బోళా శంకరుడని పేరు. మహాశక్తిమం తుడు. త్రిమూర్తుల లో ఒకడు. సర్వస్వతంత్రుడు. భూత గణ సంసేవి తుడై, తృటిలో భస్మం చేసే శక్తిగల మూడవ కన్నును కల్గిన ఇతడు లయకారక కర్త. కైలాసం ఇతని నివాసం.
ఈ అష్టదిక్పాలకులందరినీ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ సంరంభంలో స్మరించడం పుణ్యప్రదం. ముక్తిప్రదం. శుభప్రదం.

  • రామకిష్టయ్య సంగనభట్ల
    9440595494

తొలిగా పెద్దశేష వాహనమే ఎందుకు?
ఈరోజు ఉదయం ధ్వజారోహణం. రాత్రి శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై పెద్ద శేష వాహనంపై తిరుమల ఆలయం పరిధిలోని నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. మొదటగా స్వామివారు పెద్దశేష వాహనంపై ఊరేగడానికి కారణం స్వామి వారు కొలువుదీరింది శేషాద్రి, ధరించేది శేష వస్త్రం. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ మొదటిరోజు స్వామివారు ఆదిశేషుడునే పెద్దశేష వాహనం చేసుకుని ఊరేగుతారు.

వాహన సేవలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అత్యంత వన్నె చేకూర్చేవి వివిధ వాహన సేవలు. అలంకార తేజోవిలాసుడైన శ్రీ మలయప్పస్వామివారు పెద్దశేష, చిన్నశేష, హంస, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష, సర్వభూపాల, గరుడ, హనుమ, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ, అశ్వ వాహనాలు కలిపి 13 వాహనాలపైనే కాకుండా మోహినీ అవతారం, స్వర్ణరథం, రథోత్స వాల్లో కూడా తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఒక్కొక్క వాహనం ద్వారా భక్తజన కోటికి అద్భుతమైన సందేశాన్ని అందిస్తారు.

స్నపనం అంటే ఏమిటి?
శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో మాత్రమే స్వామి వారికి స్నపనం చేస్తారు. దీన్ని ఉత్సవానంతర స్నపనం అంటారు. బ్రహ్మో త్సవాల సమయంలో శ్రీదేవి భూదేవి సహిత మలయప్పస్వామివారు బ్రహ్మో త్సవాల సమయంలో ఉదయం ఒక వాహన సేవ, తిరిగి రాత్రి ఒక వాహన సేవతో క్షణం తీరికలేకుండా ఉంటారు. అందుకే ఈ రెండు వాహనసేవల మధ్య సమయంలో స్వామి వారికి నిర్వహించే ప్రత్యేక సుగంధ ద్రవ్య అభిషేకమే స్నపనం. దీనిద్వారా స్వామివారికి ఉపశమనం కలిగించి తిరిగి రాత్రి వాహనానికి నూతనోత్తేజంతో, ఉత్సాహంతో వాహనాన్ని అధిరోహించేందుకు సంసిద్ధం చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement