‘ఇచ్చా ద్వేష సముథ్థేన ద్వంద్వ మొహేన భారత సర్వ భూతాని సమ్మోహం సర్గే యాంతి’
అనంతంగా ఉన్న ఈ సృష్టిలో, అనంత జీవరసులు సృష్టి ఐన దగ్గరనుండి సృష్టి అంతం వరకు కూడా మనం ద్వంద్వ అనుభవాలుగా చూస్తూ ఉన్న మంచి చెడు, కష్టం సుఖం, లాభం నష్టం, పుణ్యం పాపం, దేవ అసుర, చీకటి వెలుగు, హెచ్చు తగ్గు, అనుకూలం ప్రతికులం, ఇలా మనం చూస్తున్న కొన్నికోట్ల ద్వంద్వాలు ప్రతిజీవికీ అనుభవానికి వస్తూనే ఉంటాయి. ఇవన్నీ సృష్టి అదినుంచి అంతం వరకు అనుభవించ వలసినదే… తప్పదు. ఇది భగవంతుని మాట. ఇదేమిటి ఇలా ఉన్నది అని మనం అనుకుని చింతించ అవసరం లేదు. అసలు ఉన్న సత్యం ఏదో తెలుసుకునే ప్రయత్నిం చేసి తెలుసుకుంటే మనకున్న అనుమాన అంధకారం తొలగిపోయి ఆ ఉన్న సత్య జ్ఞానోదయం కలిగి ఆ జ్ఞానం, జ్ఞాన సూర్యునిలా ఎప్పటికీ ప్రకాసిస్తూ ఉంటుంది. దీనినే మనం ప్రయత్నించి పట్టుకుని ఎప్పటికీ అనుభవిస్తూ ఉంటుండాలి అంతే.
నిరాకారుడు, సర్వజ్ఞాడు, సర్వ శక్తి సమన్వితుడు, సర్వ వ్యాపకుడు, శాశ్వతుడై ఈ జడ, చేతన ఆత్మకంగా జీవ జగత్ ఆత్మకంగా ఉన్న అనంతమైన సర్వ సృష్టి, స్థితి, లయం వీటన్నిటి కారకుడు సర్వత్ర సర్వదా నేనే ఉన్నాను నేనే ఉంటాను, అని స్వత: ప్రమాణంగా అనుభవిస్తున్న ఆ పరమాత్మ, పరిశుద్ధాత్మ ఇలా ద్వంద్వ విధంగా సృష్టి చేయక పొతే, ఈ జీవజాతి నష్టం పాలు ఐపోతుందని, అలా కాగూడదనే దృష్టితో ఇలా సృష్టిక్రియ జరిగింది.
ఎలా అంటే నేను చూస్తూ, చేస్తున్నాను అనుకుంటూ కర్మలు చేస్తూ కర్తగా వ్యవహారిస్తున్న ఈ జీవుడు, వాడే ఇంకా నేను ఈ కర్మల ఫలితం అనుభవిస్తున్నాను అనుకుంటూ భోక్తగానూ వ్యవహరిస్తూ ఉంటాడు ఆ జీవుడే, ఇలా వీడే కర్తగా చేస్తూ, భోక్తగా ఫలితం అనుభవిస్తుంటాడు, ఈ విధంగా జీవుడు వీడి జననం నుండి మరణం వరకు ఈ ప్రపంచంలో కర్మలు చేస్తూ ఫలితం అనుభవించాల్సిందే కదా, తప్పించుకో లేడు కదా ఈ శరీరం ఉన్నంత వరకు. ఇప్పుడు లోకంలో ద్వంద్వాలు అంటే చెడు అనే పదార్ధం లేకుండా అంతా మంచే ఉండాలని మనం కోరుకుంటూ ఉన్నట్లయితే, చెడు అనే వ్యతిరేక పదార్ధం లేకపోతే ఆ ఉన్న ఒక్క పదార్ధాన్ని మంచి అనే పేరు ఎలా వర్తిస్తుంది. ఇలాగే ఈ సూత్రమే లోకంలో ఉన్న అన్ని అనుకూల, ప్రతికూల ద్వంద్వాలకూ వర్తిస్తుంది. ఐతే మనం తెలుసుకుని మసలుకోవలసిన అసలు విషయం ఏమంటే, మనకంటే ముందు లోకంలో పుట్టి అనుభవించి పోయిన పెద్దలు ఏఏ విషయాలలో ఎలా వ్యవహరించి ఎవరెవరు ఎంత లాభపడ్డారు లేక ఎలా ఎంత నష్టపోయారు, అని తెలుసుకుంటూ మనం కూడా ఈ శరీర పతనం అయ్యే వరకు లోకంతో వ్యవ#హరిస్తూ నష్టం పాలు కాకుండా ఉండటం కోసమే ఈ అనుకూల ప్రతికూల ద్వంద్వ విషయాలు, వాటి అనుభవాలు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి.
కాబట్టి మనం ఈ శరీరంతో జీవించి ఉన్నంత కాలం మన కర్తవ్యం, బాధ్యత ఎమిటో ఎంతవరకో తెలుసుకుని మన క్షేమం, లోక క్షేమం కూడా కోరుకుంటూ మన సర్వ కర్మలను ఆచరిస్తూ, అనుకూల ఫలితాలు ఆశిస్తూ ప్రతికూల ఫలితం ప్రాప్తిస్తే నిరాశ, నిస్పృహ చెందక ఇదంతా ఆ భగవదేచ్ఛ అనుకుంటూ వ్యవహరించే ప్రయత్నమే చేస్తూ జీవిత గమ్యం చేరుదాం.
– దండంరాజు రాంచందర్ రావు