Tuesday, November 26, 2024

భక్తుల భాగస్వామ్యంతోనే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు : టీటీడీ ఈవో

తిరుమల : టీటీడీలోని అన్ని విభాగాలు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో గురువారం టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్‌తో కలిసి నాలుగు మాడ వీధుల్లోని వివిధ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను, గ్యాలరీలను పరిశీలించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ, టీటీడీ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది పెరటాసి మాసం మరియు అక్టోబరు 1న గరుడ సేవతో పాటు అన్ని వాహన సేవలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

“గత రెండు సంవత్సరాలు, కోవిడ్ మహమ్మారి ఆంక్షల కారణంగా ఆలయం లోపల ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు చెప్పారు. అధిక సంఖ్యలో బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులందరికీ స్వామివారి వాహన సేవ వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని” సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. “బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు, టీటీడీ విజిలెన్స్, జిల్లా కలెక్టర్, పోలీసులు ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగంతో కలిసి నాలుగు మాడ వీధులు, గ్యాలరీలను రెండుసార్లు తనిఖీ చేశారన్నారు. ఈ రోజు తనిఖీ సందర్భంగా, తాను కూడా అన్ని ప్రాంతాలను పరిశీలించినట్లు చెప్పారు. ముఖ్యంగా గరుడ సేవ రోజున రాగి మాను ప్రాంతంలో భక్తులను ఉంచడానికి బఫర్ జోన్‌గా ఎలా ఉంచాలనే దానిపై పరిశీలించినట్లు ” ఆయన తెలిపారు. ఈ సంవత్సరం, భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఓపికతో వేచి ఉండి దర్శనం చేసుకోవాలని ఈవో విజ్ఞప్తి చేశారు. ఎస్‌ఈ 2 జగదీశ్వర్‌రెడ్డి, విజివోలు బాలిరెడ్డి, మనోహర్, ఇంజినీరింగ్ అధికారులు, ఏవీఎస్‌వోలు, వీఐలు, తిరుమల పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement