వలచి వచ్చితి నేను వానికిగాను
నెలవై మీ గొల్లవాడనే తానుండునంట || ||వలచి వచ్చితి నేను||
చెం దమ్మి కన్నులవాడు చేతిపిల్లగోవివాడు
ఇందువచ్చె కంటిరా ఏమిరే అమ్మా
మందల పసువులవాడు మకరాంకములవాడు
ఎందు నున్నాడు చెప్పరే ఏలదాచేరమ్మ|| ||వలచి వచ్చితి నేను||
నెమలిపించమువాడు నీమేఘకాంతివాడు
రమణుడాతడు మొక్కేను రమ్మనరమ్మా
జమళి చేతులవాడు సంకుచక్రములవాడు
అమర మీపాల చిక్కునట చూపరమ్మా || ||వలచి వచ్చితి నేను||
పచ్చపైడిదట్టివాడు పక్షివామనపువాడు
ఇచ్చినాడు నాకుంగరము ఇదివో అమ్మా
చెచ్చెర కోనేటివాడు శ్రీవేంకటేశ్వరుడు
వచ్చి నన్ను కూడినాడు వాడు ఓయమ్మా|| ||వలచి వచ్చితి నేను||