పురుషోత్తముడ వీవు పురుషాధముడ నేను
ధరలోన నాయందు మంచితనమేది || ||పురుషోత్తముడవీవు||
అనంతాపరాధములు అటునేము సేసేవి
అనంతమైన దయ అది నీ ది
నిను నెరుగ కుండేటి నీచగుణము నాది
నను నెడయ కుండేటి గుణము నీది || ||పురుషోత్తముడవీవు||
సకల యాచకమే సరుస నాకు పని
స కల రక్షకత్వము సరి నీ పని
ప్రకటించి నిన్ను దూరే పలుకే నాకెప్పుడును
వెకలివై ననుకాచే విధము నీది || ||పురుషోత్తముడవీవు||
నేరమింతయు నాది నేరుపింతయు నీది
సారెకు అజ్ఞాని నేను జ్ఞానివి నీవు
ఈ రీతి వేంకటేశ ఇట్టె నన్ను నేలితివి
ధారుణిలో నిండెను ప్రతాపము నీది || ||పురుషోత్తముడవీవు||