హరికృష్ణే మేలుకొను ఆది పురుషా
తరవాత నామోము తప్పకిటుచూడు ||హరికృష్ణే మేలుకొను||
మేలుకొను నాయన్న మెల్లనే నీ తోడి
బాలులదే పిలిచేరు బడినాడను
చాలునిక నిద్దరలు చద్దికూల్ళ పొద్దు
వేలాయ నా తండ్రి వేగలేవే ||హరికృష్ణే మేలుకొను||
కనుదెరవు నా తండ్రి కమలాప్తుడయించె
వనిత మొక మజ్జనము వడిదెచ్చెను
మొనసి మీ తండ్రియిదె ముద్దాడ చెలగేని
దనుజాంతకుండ యిక దగ మేలుకోవే ||హరికృష్ణే మేలుకొను||
లేవెనా తండ్రి నీలీల లిటు పొగడేరు
శ్రీ వేంకటాద్రిపతి శ్రీ రమణుడా
దేవతలు మునులు చెందిన నారదాదులు
ఆవలను పాడేరు ఆకసమునందు ||హరికృష్ణే మేలుకొను||