ప|| కంటిమి నేడిదె గరుడాచలపతి
యింటి వేలుపగు యీశ్వరుడితడు || కంటిమి ||
చ|| శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు
దానవాంతకుడు దయానిధి
నానా మహిమల నమ్మిన వారిని
పూనుక కాచే పోషకుడితడు || కంటిమి ||
చ|| దేవాది దేవుడు దినకర తేజుడు
జీవాంతరంగుడు శ్రీ విభుడు
దైవ శిఖామణి తలచిన వారిని
సేవలుగొని కాచే విభుడితడు || కంటిమి ||
చ|| పరమమూర్తి హరి ప్రహ్లాద వరదుడు
కరుణానిధి బుధకల్పము
పరగు శ్రీ వేంకటపతి తనదాసుల
నరుదుగ కాచే అనంతుడితడు || కంటిమి ||