రాగం : సింధుభైరవి
కేశవదాసి నైతి గెలిచితి నన్నిటాను
యీ శరీరపు నేరాలికనేల వెదక ||కేశవదాసి నైతి||
నిచ్చలు కోరికలియ్య నీనామమే చాలు
తెచ్చి పునీతుచేయ నీతీర్థయే చాలు
పచ్చిపాపాలణచ నీ ప్రసాదమే చాలు
యెచ్చు కొందు వుపాయాలు ఇకనేల వెదక | ||కేశవదాసి నైతి||
ఘనుని చేయగను నీ కైంకర్యమే చాలు
మొనసి రక్షించను నీ ముద్రలే చాలు
మనిషి కానగ తిరుమణి లాంఛనమే చాలు
యెనసెను దిక్కుదెస ఇకనేల వెదక | ||కేశవదాసి నైతి||
నెలవైన సుఖమియ్య నీ ధ్యానమేచాలు
అల దాపుదండకు నీ యర్చనే చాలు
యిలపై శ్రీవేంకటేశ యిన్నిటా మాకు కలవు
యెలమి నితరములు యికనేల వెదక | ||కేశవదాసి నైతి||