రాగం : గుండక్రియ
కడుపెంత తాకుడుచు కుడుపెంత దీనికై
పడిని పాట్ల నెల్ల పడి పొరల నేల || ||కడుపెంత తాకుడుచు||
పరుల మనసునకు ఆపదలు కలుగగచేయు
పరితాపకరమైన బ్రతుకేల
సొరిది ఇతరుల మేలుచూచి సైపగలేక
తిరుగు చుండే కష్ట దేహమది ఏల || ||కడుపెంత తాకుడుచు||
ఎదరికైప్పుడు చేయు హితమెల్ల తనుదనుచు
చదివి చెప్పనియట్టి చదువేల
పొదిగొన్న యాసతో బుంగుడై సతతంబు
సదమదంబై పడయు చవులు తనకేల || ||కడుపెంత తాకుడుచు||
శ్రీవేంకటేశ్వరుని సేవారతికి గాక
జీవనభ్రాంతిపడు సిరులేల
దేవోత్తముని యాత్మతెలియనొల్లక పెక్కు
త్రోవలేగిన దేహి దొరతనం బేల || ||కడుపెంత తాకుడుచు||