ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపముమరి
యిదిగాక వైభవం బిక నొకటికలదా || ||ఇదిగాక సౌభాగ్యమిదిగాక||
అతివజన్మము సఫలమై పరమ యోగివలె
నిరత మోహాపేక్షలన్నియు విడిచె
సతి కోరికలు మహాశాంతమై యిదెచూడ
సతత విజ్ఞాన వాసనవోలె నుండె || ||ఇదిగాక సౌభాగ్యమిదిగాక||
తరుణి హృదయము కృతార్థత పొంది విబుమీది
పరవశానంద సంపదకు నిరవాయ
సరసిజానన మనోజయమంది యింతలో
సరిలేక మనసు నిశ్చల భావమాయ || ||ఇదిగాక సౌభాగ్యమిదిగాక||
శ్రీవేంకటేశ్వరుని చింతించి పరతత్వ
భావంబు నిజముగా పట్టె చెలియాత్మ
దేవోత్తముని కృపాధీనురాలై యిపుడు
లావణ్యవతికి నుల్లంబు దిరమాయ || ||ఇదిగాక సౌభాగ్యమిదిగాక||