ఏకులజుడేమి యెవ్వడైననేమి
ఆకడ నాతడె హరినె ఱిగినవాడు
పరగిన సత్యసంపన్నుడైన వాడే
పరనిందసేయ తత్పరుడు కాని వాడు
అరుదైన భూతదయానిధి యగువాడే
పరులు తానేయని భావించువాడు
నిర్మలుడై యాత్మనియతి గలుగువాడే
ధర్మతత్పర బుద్ధి తగిలినవాడు
కర్మమార్గములు కడవనివాడే
మర్మమై హరిభక్తి మఱవనివాడు
జగతిపై హితముగా చరియించువాడే
పగలేక మతిలోన బ్రదికినవాడు
తెగి సకలము నాత్మ తెలసినవాడే
తగిలి వెంకటేశు దాసుడయినవాడు