రాగం : సురటి
ఎత్తరె ఆరతు లీమెకు ఇంతులాలా
హత్తెను శ్రీ వేంకటేశు కలమేలుమంగ
హరివురమ్ముపై సొమ్ము అరుతగట్టిన తాళి
సరిలేని దేవుని సంసార ఫలము
సిరులకు పుట్టి నిల్లు సింగారములవిత్తు
మెరుగుబోడి యలమేలు మంగ
పరమాత్మునికి నాత్మ భావములో కీలుబొమ్మ
కెరలుచు నితడు భోగించు మేడ
సరసపు సముద్రము సతమైన కొంగు పైడి
అరిది సంపదలది యలమేలు మంగ
శ్రీ వేంకటేశు దేవి చిత్తజుగన్న తల్లిd
యీ విభుని కౌగిటిలో యేచిన కళ
బూవపు పెళ్లిమేలు పొందిన నిధానము
ఆవల నీవల నీమె యలమేలు మంగ