Friday, November 22, 2024

అన్నమయ్య కీర్తనలు : నాటికినాడే నాచదువు

రాగం : వలజి

నాటికినాడే నాచదువు
మాట లాడుచును మరచేటి చదువు || ||నాటికినాడే నాచదువు||

ఎనయ నీతని ఎఱుగుటకేపో
వెనకవారు చదివిన చదువు
మనసున నీతని మరుచుట కేపో
పనివడి యిప్పటి ప్రౌఢలచదువు || ||నాటికినాడే నాచదువు||

తెలిసి యితనినే తెలియుటకే పో
తొలుత గృతయుగాదుల చదువు
కలిగిన యీతని కాదననే పో
కలియుగంబులో కలిగిన చదువు || ||నాటికినాడే నాచదువు||

పరమని వేంకటపతి గనుటకె పో
దొరలగు బ్రహ్మాదుల చదువు
సిరుల నితని మరచెడి కొరకేపో
విరసపు జీవుల విద్యల చదువులు || ||నాటికినాడే నాచదువు||

Advertisement

తాజా వార్తలు

Advertisement