రాగం : సామంతం
నీవనగ నొకచోట నలిచివుం డుటలేదు
నీవనుచు కనుగొన్న నిజమెల్ల నీవె|| ||నీవనగ నొకచోట||
తన యాత్మవలెనె భూతముల యాతుమలెల్ల
అనయంబు కనుగొన్న యతడే నీవు
తనుకన్నతల్లిగా తగ నితర కాంతలను
అనఘుడై మదిచూచు నతడే నీవు|| ||నీవనగ నొకచోట||
సతత సత్యవ్రతాచార సంపన్నుడై
అతిశయంబుగ మెలగు నతడే నీవు
ధృతి దూలి ద్రవ్యంబు తృణముగా భావించు
హతకాముకుండైన యతడే నీవు|| ||నీవనగ నొకచోట||
మోదమును సుఖదు:ఖములు నొక్కరీతిగా
ఆదరింపుచునున్న యతడే నీవు
వేదోక్తమతియైన వేంకటాచలనాథ
ఆదియును అంత్యంబు అంతయును నీవె|| ||నీవనగ నొకచోట||