రాగం : మోహన
తిరువీధు లేగీని దేవతలు జయవెట్ట
హరి వాడె పెండ్లికొడుకై పత్రాపమున || ||తిరువీధు లేగీని||
కనకపు కొండవంటి ఘనమైన రథముపై
దనుజమర్దనుడెక్కె తరుణులతో
వినువీధిపడెగెలు వేవేలు కుచ్చులతోడ
పెనగొనగ కదలె భేరులు మ్రోయగును || ||తిరువీధు లేగీని||
వరుసచంద్రసూర్యుల వంటి బండికండ్ల తోడ
గరుడధ్వజుడొరసీ కడు దిక్కులు
పరగువేదరాసులే పగ్గాలు పట్టితియ్యగ
సరుగ దుష్టుల గొట్టి జయము చేకొనెను || ||తిరువీధు లేగీని||
ఆటలు పాటలు వింటా నలమేల్మంగయు తాను
యీటుల శ్రీ వేంకటేశుడెదురులేక
వాటపుసింగారముతో వాకిట వచ్చి నిలిచీ
కోటాన కోటి వరాలు కొమ్మని ఇచ్చుచును || ||తిరువీధు లేగీని||