ఎదుటనున్నాడు వీడె ఈ బాలుడు
మదితెలియమ్మ ఏమరులోకాని || ||ఎదుటనున్నాడు వీడె||
పరమ పురుషుడట పసులగాచెనట
సరవులెంచిన వి న సంగతాయిది
హరియె తానట ముద్దులందరికి జేసెనట
ఇరవాయనమ్మ సుద్దులేటివో గాని || ||ఎదుటనున్నాడు వీడె||
వేదాలకొడయడట వెన్నలు దొంగిలెనట
అదించి విన్నవారికి నమ్మికాయిది
ఆదిమూల మీతడట ఆడికెల చాతలట
కాదమ్మ ఈ సుద్దులెట్టికతలో కాని || ||ఎదుటనున్నాడు వీడె||
అల బ్రహ్మాతండ్రియట యశోదకు బిడ్డడట
కొలదొకరికి చెప్పకూడునా యిది
తెలిపి శ్రీ వేంకటాద్రి దేవుడై నిలచెనట
కలదమ్మ తనకెంతో కరుణో కాని || ||ఎదుటనున్నాడు వీడె||