రాగం : హిందోళం
ఈతడు తారక బ్రహ్మ మితడు మా దేవుడు
కైతుకాన చెప్పే వినగదరే వో జనులు || ||ఈతడు తారక బ్రహ్మ ||
రాముడు యిందీవరశ్యాముడు నానాసార్వ –
భౌముడు షోడశక ళాసోముడు
దోమటి రాక్షసులను తుత్తుమురు సేసినాడు
కామిత ఫలము లిచ్చి కాచినాడు సురల || ||ఈతడు తారక బ్రహ్మ ||
పూర్ణుడు నీలమేఘవర్ణుడు దానమున వి –
స్తీర్ణుడు వాహన సుపర్ణుడు
ఆర్ణవము దాటి రావణాదుల గెలిచినవాడు
నిర్ణయించి చెప్పరాదు నేడీతని మహిమ || ||ఈతడు తారక బ్రహ్మ ||
వరుడు సీతకు పరాత్పరుడు కోదండ దీక్షా
గురుడు దివ్యామోఘశరుడితడు
నిరతి శ్రీవేంకటాద్రి నెలవై యుండేటివాడు
సరి భరత లక్ష్మణ శత్రుఘ్న సహితుడు || ||ఈతడు తారక బ్రహ్మ ||