రాగం : ఖరహరప్రియ
దేవదుందుభులతోడ తేట తెల్లమైనవాడు
సేవించరో యిదే వీడే సింగారదేవుడు ||దేవదుందుభులతోడ||
బంగారుమేడలలోన పన్నీట మజ్జనమాడి
అంగముతడి యెత్తగా నదె దేవుడు
ముంగిట పులుకడిగిన ముత్తెము వలె నున్నాడు
కుంగని రాజ సముతో కొండవంటి దేవుడు ||దేవదుందుభులతోడ||
కాంతులు మించిన మాణికపు తోరణము కింద
అంతట కపపురము చాతుకదె దేవుడు
పొంతల నమృతమే పోగైనట్టున్నవాడు
సంతతము సంపదల సరిలేని దేవుడు ||దేవదుందుభులతోడ||
తట్టుపుణుగు నించుక దండిసొమ్ము లెల్లాబెట్టి
అట్టె అలమేల్మంగ నరుత గట్టి
నెట్టన నమ్మినవారి నిధానమై వున్నవాడు
పట్టపు శ్రీవేంకటాద్రిపతియైన దేవుడు ||దేవదుందుభులతోడ||